Sunday, May 16, 2021

బండి సంజయ్‌కు సవాల్ విసిరిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

తనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ మాటలు సమాజమే సిగ్గుపడే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎవరు ఏ కాగితం ఇస్తే అదే చదువుతూ చరిత్ర కలిగిన నాయకులపై బండి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అనే పదాన్ని మాట్లాడేందుకు భయపడే రోజుల్లో సంఘాలను పెట్టి తాము తెలంగాణ కోసం కొట్లాడమని గుర్తుచేశారు.
ఆనాడు రాజీనామాలు చేయమంటే వెనక్కి పోయిన బీజేపీ నాయకులకు తమతో పోలికేంటని ఎద్దేవా చేశారు.

బీజేపీ నేతల అక్రమ వ్యాపారాలు చిట్టా తనకు తెలుసని, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తమ ఇంటిని తాము కష్టపడి కొనుక్కున్నామని, తమకు అమ్మిన వాళ్లందరూ బతికే ఉన్నారని తెలిపారు. బండి సంజయ్ పెద్ద బీసీ నాయకుడు అంటారని, ఇదేనా బీసీ నాయకుడికి ఉండే తెలివి అని ప్రశ్నించారు. తన పాస్ బుక్‌లో ఉన్నదాని కంటే ఒక్క గజం ఎక్కువ ఉంటే మొత్తం దానం చేస్తానని బండి సంజయ్‌కు మంత్రి సవాల్ విసిరారు. తన దగ్గర ఉన్న సర్వే నంబర్లు తప్పు అయితే అన్ని పదవులకు రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ తనపై ఆరోపణలు నిజం కాకపోతే బండి సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు? 2014 కు ముందు మహబూబ్ నగర్, ప్రస్తుత మహబూబ్ నగర్ ఎలా ఉందో బండి సంజయ్ తెలుసుకోవాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News