Friday, April 19, 2024

విపక్షాలకు ఓటమి భయం: కొడాలి

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు వాయిదా వేయడంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదనే త్వరగతిన ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికలకు భయపడి పారిపోయిన టీడీపీ, ఓడిపోతామని తెలిసి నామమాత్రపు స్థానాల్లో పోటీ చేస్తున్న బిజెపి, జనసేనలు ఎన్నికలను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ఎన్నికలు వాయిదా వేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై, రేపు హౌస్ మోషన్ పిటిషన్ వేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హౌస్ మోషన్ పిటిషన్ లో 21 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన, తాము సిద్దమేనని మంత్రి కొడాలి స్పష్టం చేశారు.

కాగా, ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఎన్నికల కోడ్‌కు సంబంధించి మినిమం నాలుగువారాలు కోడ్ అమలు చేయాలన్న సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఎస్ఈసీ పాటించ‌లేద‌ని పిటిష‌న‌ర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. సుప్రీం ఆదేశాల‌తో కోడ్ విధించ‌లేద‌ని టీడీపీ తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదించింది. ఇరుపక్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు పరిష‌త్ ఎన్నిక‌ల‌పై స్టే విధించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈనెల 15న ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 8న ఏపీలో ప‌రిష‌త్ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. 7,258 ఎంపీటీసీ, 516 జెడ్పీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement