Thursday, April 25, 2024

ఈసారి పవన్‌కు డిపాజిట్లు కూడా రావు: మంత్రి కొడాలి నాని

ఏపీలో పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంతో ఆ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కృష్ణా జిల్లా నందివాడ మండల టిడిపి జెడ్పీటీసీ అభ్యర్థి దాసరి మేరీ విజయ కుమారి మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు. జిల్లా పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమె పార్టీకి రాజీనామా చేశారు. మేరీ విజయతో పాటుగా పలువురు టీడీపీ నాయకులకు మంత్రి కొడాలి నాని వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు.

రాష్ట్రంలో పూర్తిగా అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకా హత్య జరిగితే స్పందించని పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమైందని.. విచారణలో జగన్, ఆయనకు సంబంధించిన వ్యక్తుల పాత్ర ఉంటే అప్పుడే కేసు నమోదు చేసేవారన్నారు. తన తండ్రి హత్య కేసు విచారణపై వివేకా కుమార్తె ఢిల్లీలో సీబీఐని ప్రశ్నిస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. వివేకా హత్య విచారణ కేసులో కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్.. తమ ప్రభుత్వం విచారణ చేయట్లేదని మాట్లాడడం అవగాహన రాహిత్యమన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ చేసే విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ఎవరో రాసిచ్చిన డైలాగులు, స్క్రిప్టులను పవన్ చదువుతున్నారని ఎద్దేవా చేశారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు

అటు ఆలయాలపై తమకు అమిత ప్రేమ ఉన్నట్లు బీజేపీ నటిస్తోందని.. అంతర్వేది రథం దగ్ధం కేసులో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించలేదని మంత్రి కొడాలి నాని విమర్శించారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేసిన కేసుల్లో అనేక మందిని అరెస్టులు చేశారని.. మత విద్వేషాలు ద్వారా లబ్ధి పొందేందుకు రాష్ట్రంలో టీడీపీ, బిజెపి, జనసేన కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. కేంద్రానికి ధైర్యం ఉంటే ఆలయాలపై జరిగిన దాడులపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement