Friday, February 3, 2023

మెడికల్ కళాశాల తరగతి గదులకు మంత్రి గంగుల భూమిపూజ

కరీంనగర్ మెడికల్ కళాశాల కోసం రూ.7కోట్లతో తరగతి గదుల నిర్మాణానికి మంగళవారం కొత్తపల్లి విత్తన శుద్ధి క్షేత్రంలో మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి చైర్మన్ రుద్ర రాజులతో కలసి మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. త్వరలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ లను భర్తీ చేసి NMC కీ నివేదిక అందజేస్తామని ఈ సందర్బంగా మంత్రి ప్రకటించారు. కళాశాలకు NMC (నేషనల్ మెడికల్ కమీషన్) అనుమతులు రాగానే అడ్మిషన్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. రెండు, మూడు నెలల్లో ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు ప్రారంభించి ఆగస్టు 2023లో తరగతులు ప్రారంబిస్తామన్నారు. ఈనెల 18తారీఖున NMC (నేషనల్ మెడికల్ కమీషన్ ) బృందం పరిశీలించి వెళ్ళిందని వివరించారు. రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయ సాధన దిశగా ముందడుగు పడిందన్నారు. కరీంనగర్ జిల్లాకు 100 MBBS సీట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. తాత్కాలిక గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.7కోట్లు మంజూరు చేసిందని, వీటి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

- Advertisement -
   

తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఐదు మెడికల్‌ కాలేజీలే ఉన్నాయని, ఇందులో ఉస్మానియా, గాంధీ దవాఖానలు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేకన్నా ముందే స్థాపించారని తెలిపారు. అంటే.. 60 ఏండ్లలో తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం మూడు ఉండేవని స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారన్నారు. మొదటి విడతలో ప్రభుత్వం మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో నాలుగు, రెండో విడతగా.. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో 8 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. వీటిల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇప్పుడు మూడోవిడతగా మరో 8 వైద్య కాలేజీలు మంజూరు చేసిందన్నారు. తద్వారా రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల సంఖ్య 25కు పెరుగనుందన్నారు. ఇందులో 20 కాలేజీలను ఎనిమిదేండ్లలోనే ఏర్పాటు చేయడం సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement