Friday, March 29, 2024

నాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి: ప్రభుత్వానికి ఈటల సవాల్!

తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తాను ఏ భూమిని కబ్జా చేయలేదని, పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి ఈటెల భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు మంత్రి ఈటల. ఈ ఆరోపణల అంశంపై వివరణ ఇచ్చారు. తన మొత్తం రాజకీయ చరిత్ర, ఆస్తులపై విచారణ జరిపించుకోవాలని మంత్రి ఈటెల ప్రభుత్వానికి సవాలు విసిరారు. తాను తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని, సన్యాసం కూడా పుచ్చుకుంటానని ప్రకటించారు. తన ఆస్తులు తన చెమట చుక్కలతో సాంపాదించానని, తన ఆస్తుల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తానే డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. తాను ఒక్క రూపాయి తీసుకున్నానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. ఈ చిల్లర రాజకీయాలకు ఈటల రాజేందర్ లొంగిపోడన్నారు. 2016లో జమున హెచరీస్ కోసం ఎకరం రూ.6 లక్షల చొప్పున 40 ఎకరాల భూమిని ఒకేసారి కొన్నామని మంత్రి చెప్పారు. కెనరా బ్యాంకు నుంచి రూ.100 కోట్లు రుణంగా తీసుకున్నట్లు ఈటల తెలిపారు. తాను తీసుకున్న భూముల చుట్టూ అసైన్డ్ భూములున్న విషయాన్ని సీఎంకు కూడా చెప్పానని, ఆ భూములన్నీ ఇప్పటికీ వాళ్ల దగ్గరే ఉన్నాయని మంత్రి ఈటల చెప్పారు. 

అసైన్డ్ భూములు అమ్మవద్దని, కొనవద్దని తానే రైతులకు చెప్పానని ఆయన వ్యాఖ్యానించారు. రైతులే భూములను ప్రభుత్వానికి సరండర్ చేస్తూ లేఖలు ఇచ్చారని మంత్రి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీఎస్, విజిలెన్స్ డీజీతోనే కాకుండా సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వానికి మంత్రి ఈటల సవాల్ విసిరారు. తాను దొరనని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అంతకంటే నీచమైన ప్రచారం మరొకటి ఉండదని ఈటల వ్యాఖ్యానించారు. తాను ముదిరాజ్ బిడ్డనని, తన భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని.. తన కొడుకు పేరు నితిన్ అని, తన భార్య నితిన్ రెడ్డి అని పేరు పెట్టుకుందని.. దొర పెత్తనాలకు, అణచివేతలకు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తిని తానని మంత్రి ఈటల గుర్తుచేశారు.

‘’ఆస్తులు, పదవుల కోసం తాను లొంగిపోను. నా ఆత్మ గౌరవం కంటే ఈ పదవి గొప్పది కాదు. 20 ఏళ్లలో ఏనాడూ తప్పు చేయలేదు. సీఎం ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమాజానికి నిజాలు చూపించాలి. 1986లో పెట్టిన కోళ్ల ఫారాన్నే ఇప్పటికీ అదే నడుపుతున్నాం. ఈటల రాజేందర్ భూమి కోల్పోయినా పర్వాలేదు కానీ, ఆత్మను అమ్ముకోడు. నా వద్ద అసైన్ డ్ భూములు గజం ఉన్నా తీసుకోవచ్చు. సాటి మనిషికి ఆపద వస్తే ముందుండేవాడిని. నేను అవినీతి చేస్తే ఆరు సార్లు నన్ను ప్రజలు గెలిపించరు. నేను అసైన్ డ్ భూములు తీసుకున్నానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. నా పదవి గడ్డిపోచతో సమానం అని నేను అవమానకరంగా మాట్లాడను.’’ అని ఈటెల  వ్యాఖ్యానించారు.

తాను నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాని తెలిపారు.  పౌల్ట్రీకి భూమి ఎక్కువగా కావాలని, విస్తరణ కోసం పరిశ్రమల శాఖకు అప్పట్లో లేఖ రాశానని ఈటల చెప్పారు. కెనరా బ్యాంకు ద్వారా తన పరిశ్రమ విస్తరణ కోసం రూ.వంద కోట్ల రుణం తీసుకున్నట్లు వివరించారు. అది వ్యవసాయ భూమి కాదని, రైతులు స్వచ్ఛందంగా సరెండర్ చేస్తే, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వొచ్చని చెప్పారని అన్నారు. ముందస్తు ప్రణాళికతో తనపై దుష్ప్రచారం చేశారని, కట్టుకథలు అల్లారని ఆరోపించారు. ఒక ఎకరం కూడా తన స్వాధీనంలో లేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు రాజీనామా చేస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ఈ విచారణ తేలాక ఆలోచిస్తానని మంత్రి సమాధానం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement