Saturday, April 20, 2024

జిల్లా జైలులో ఎంఐఎం నేత ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్‌ జిల్లా జైలులో ఉన్న మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఫారుఖ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో జైలు సిబ్బంది వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఫారుఖ్‌కు చికిత్స అందిస్తున్నట్లు రిమ్స్ వైద్యులు వెల్లడించారు. కాగా రిమ్స్ ఆస్పత్రి ఎదుట ఎంఐఎం కార్యకర్తలు, ఫారుఖ్ బంధువులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్‌లో గత ఏడాది డిసెంబరు 12న తుపాకీతో కాల్పులు జరిపిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్‌ అహ్మద్‌ కేసు సత్వర విచారణ కోసం హైకోర్టు ప్రత్యేక కోర్టును నియమించింది. ఈ మేరకు జిల్లా కోర్టుకు ఆదేశాలు జారీచేసింది. ఫారూఖ్‌ అహ్మద్‌, సయ్యద్‌ జమీర్‌ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఫారూఖ్‌ తుపాకీతో కాల్పులు జరపగా ముగ్గురు గాయపడ్డారు. చికిత్స పొందుతూ సయ్యద్‌ జమీర్‌ మృతి చెందారు. కేసు సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ విష్ణుఎస్‌వారియర్‌ చేసిన ప్రతిపాదనలకు స్పందించిన ప్రభుత్వం ఫిబ్రవరి 26న హైకోర్టుకు నివేదించింది. హైకోర్టు తాజాగా ఆదిలాబాద్‌లోని మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టును ప్రత్యేక కోర్టుగా నియమిస్తూ రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. కాగా ఇప్పటికే జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఫారూఖ్‌ ఈ నెల 18న పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో మనస్తాపంతో ఫారుఖ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement