Wednesday, April 24, 2024

Delhi | వరదలు, విపత్తులపై కేంద్ర హోంశాఖ సమీక్ష.. రుతుపవనాలు రాకముందే యంత్రాంగం అప్రమత్తం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు భారతదేశాన్ని చేరుకోనున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ముందే అప్రమత్తమైంది. రుతుపవనాలు మోసుకొచ్చే వర్షాల కారణంగా వరదలు, ఇతర ప్రకృతి విపత్తులు తలెత్తితే ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై కీలక విభాగాలతో కలిసి సమీక్ష నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, హోంశాఖ, జలవనరుల శాఖ, అటవీ-పర్యావరణ శాఖ, రోడ్డు రవాణా శాఖల కార్యదర్శులు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సభ్య కార్యదర్శి, ఎన్డీఆర్ఎఫ్ డైరక్టర్ జనరల్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఛైర్మన్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు, భారత వాతావరణ విభాగం, రైల్వే బోర్డు సహా వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

విపత్తులు తలెత్తినప్పుడు సకాలంలో హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా ప్రాణనష్టాన్ని పూర్తిగా నివారించడంతో పాటు వరదలను నియంత్రించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. భారత వాతావరణ విభాగం, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇప్పటి వరకు రానున్న 5 రోజుల వాతావరణ పరిస్థితి, వర్ష సూచనను అంచనా వేసి చెప్పగల్గుతున్నాయి. అయితే రుతుపవనాల సీజన్లో 7 రోజుల ముందు నుంచే వాతావరణ అంచనాలను విడుదల చేస్తే విపత్తుల నిర్వహణను మెరుగుపర్చవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు.

విపత్తులకు సంబంధించి వివిధ విభాగాలు అందజేసే సమాచారం, హెచ్చరికలను ఏకీకృతం చేస్తూ కేంద్ర హోంశాఖ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సంయుక్తంగా ఒక సాఫ్ట్‌వేర్ ను రూపొందించాలని ఆదేశించారు. శాస్త్రీయంగా విశ్లేషించి అందించే సమాచారాన్ని ముందస్తు హెచ్చరికలకు సిద్ధం చేసేలా ఈ వ్యవస్థ ఉండాలని సూచించారు. ‘ఆపద మిత్ర’ పథకం కింద గ్రామాల్లో ఈతగాళ్లకు రక్షణ విషయంలో శిక్షణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మరోవైపు దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా వరదల సమస్యను నివారించడానికి విస్తృత విధానాన్ని రూపొందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

- Advertisement -

దేశంలోని ప్రధాన నదుల పరీవాహక ప్రాంతాల్లో వరదలు, నీటిమట్టం పెరుగుదలను అంచనా వేయడానికి శాశ్వత వ్యవస్థను కలిగి ఉండటానికి కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని కేంద్ర హోం మంత్రి అధికారులను ఆదేశించారు.  భారత వాతావరణ విభాగం (IMD), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) వంటి ప్రత్యేక సంస్థలు మరింత ఖచ్చితమైన వాతావరణ, వరద అంచనాల కోసం తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునీకరించాలని సూచించారు. అకస్మాత్తుగా చోటుచేసుకునే వాతావరణ మార్పులపై వేగవంతంగా హెచ్చరికలను ప్రజలకు చేరువ చేయడం కోసం ఎస్.ఎం.ఎస్, టీవీ, ఎఫ్.ఎం రేడియో సహా ఇతర మాధ్యమాలను ఎలా ఉపయోగించాలన్న అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. భారత వాతావరణ విభాగం అభివృద్ధి చేసిన ‘ఉమంగ్’, ‘రెయిన్ అలారం’, ‘దామిని’ వంటి వాతావరణ అంచనాలకు సంబంధించిన వివిధ మొబైల్ యాప్‌లకు విస్తృతంగా ప్రచారం కల్పించి ప్రజలు ఉపయోగించేలా చేయాలని, తద్వారా వాటి ప్రయోజనాలు ప్రజలు అందుకోగల్గుతారని కేంద్ర హోంమంత్రి వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement