Saturday, April 20, 2024

మెట్రో బాదుడు.. త్వరలో భారీగా పెరగనున్న ఛార్జీలు

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ (ప్రతినిధి) : హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని మెట్రో వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్‌ మెట్రో ప్రారంభ సమయంలో ఛార్జీలను నిర్ణయించారు. 2017 నవంబర్‌ 28న నిర్ణయించిన ఛార్జీలనే ఇప్పటికీ అమలు చేస్తుండటంతో నిర్వహణ భారంగా మారిందని, ఎల్‌అండ్‌టీ సంస్థ పలుమార్లు చేసిన అభ్యర్థన మేరకు పెంపునకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఛార్జీల పెంపుపై విశ్రాంత న్యాయమూర్తి గుడిసేన శ్యామ్‌ప్రసాద్‌ అధ్యక్షులుగా, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి సంస్థ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ సురేంద్రకుమార్‌, తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ సభ్యులుగా ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ) ఏర్పాటు చేసింది.

ఛార్జీల పెంపుపై ఏర్పాటు చేసిన ఈ కమిటీ నవంబర్‌ 15వరకు ప్రజాభిప్రాయాన్ని కోరింది. ఎంత వరకు పెంచవచ్చు? ఎంత పెంచితే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది అని ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుని కొత్త ఛార్జీలను ఈ కమిటీ నిర్ణయించనుంది. ఇందుకు సంబంధించి ప్రక్రియ నవంబర్‌ 15న పూర్తి కానున్నందున ఈ నెలాఖరు వరకు ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మెట్రోఛార్జీల పెంపును నగరంలోని మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ)కి ఛార్జీల పెంపును వ్యతి రేకిస్తూ ట్విట్టర్‌, ఇతర సామాజిక మాద్యమాల ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. నగరంలోని కొన్ని మెట్రోస్టేషన్లలో ఇప్పటికి ఫ్రీపార్కింగ్‌ సౌకర్యం లేదని, ముందు అన్ని మెట్రోస్టేషన్లలో కనీస సౌకర్యాలు కల్పించిన తర్వాతే పెంచాలని ఎఫ్‌ఎఫ్‌సీ కమిటీకి విన్నతులు వెల్లువెత్తుతున్నాయి.

భారీగా పెరగనున్న ఛార్జీలు ..

మెట్రో ఛార్జీల పెరుగుదల భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 2017లో నిర్ణయించిన ఛార్జీలనే ఇప్పటికి అమలు చేస్తుండటంతో నిర్వహణ భారంగా మారిందని తెలుస్తోంది. అప్పట్లో ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం అమోదంతో ఛార్జీలను నిర్ణయించారు. ఇందులో కనిష్టంగా ఒక స్టేషన్‌ నుంచి మరో స్టేషన్‌కు రూ.10, ఒక కారిడార్‌ ప్రారంభం నుంచి మరో కాడిడార్‌ చివరి వరకు వెళ్లినా గరిష్ట రుసుం రూ.60గా ఫిక్స్‌ చేశారు. ఇప్పటి వరకు రూ.10గా ఉన్న కనిష్ట ఛార్జి రూ.20గా, గరిష్ట ఛార్జి రూ.120గా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

- Advertisement -

పెంపునకు కేంద్రం అనుమతి తప్పని సరి

మెట్రోరైల్‌ చట్టం ప్రకారం ఎల్‌అండ్‌టీ మెట్రో అడ్మినిస్ట్రేషన్‌కు తొలిసారి ఛార్జీలు మాత్రమే నిర్ణయించే అధికారం ఉంటుంది. అన్నిరాష్ట్రాల్లో మాదిరిగానే పాలనాపరమైన అధికారం ఉన్పప్పటికీ హైదరాబాద్‌ మెట్రోను పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌ (పీపీఈ) విధానంలో నిర్మించినందున ఎల్‌అండ్‌టీ సంస్థే నడుపుతోంది. ఎల్‌అండ్‌టీ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వానికి సర్వీసుల ప్రారంభ సమయంలో మాత్రమే ఛార్జీలను పెంచే అధికారం ఉంది. కొత్తగా మెట్రో ఛార్జీలను సవరించాలంటే కేంద్రానికి మాత్రమే అధికారం ఉంది. దాంతో మెట్రో వర్గాలు ఛార్జీలను పెంచాలని చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ) నియమించింది. ఈ కమిటీ ప్రజాభిప్రాయాన్ని పరిగణం లోకి తీసుకుని ఛార్జీలను నిర్ణయిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement