Thursday, April 25, 2024

తెలంగాణలో మెగా జాబ్ నోటిఫికేషన్.. ఉద్యోగాల భర్తీ ఎప్పుడంటే..

నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఉద్యోగ భర్తీకి సర్కార్‌ సర్వం సిద్ధం చేస్తున్నది. ఒకేసారి 86 వేల ఖాళీలను గుర్తించి వీటి భర్తీకి పలు శాఖల ప్రతి పాదనలతో నివేదిక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేరింది. కొన్ని పోస్టులను తొలగించిన తర్వాత సుమారుగా 65వేల నియామకాలకు సర్కార్‌ సై అనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోగా సర్దుబాట్లు, జోనల్‌, మల్టి జోనల్‌ పోస్టుల విభజన పూర్తి చేస్తున్నది. ఉద్యోగుల విభజనలో భాగంగా నిన్న‌ కీలక సమావేశం జరిగింది. విభజన కమిటీ సమావేశానికి మునిసిపల్‌, పంచాయతీ రాజ్‌, పశుసంవర్దక, స్త్రీ, శిశు సంక్షేమ, ఇరిగేషన్‌, వాణిజ్య పన్నుల అధికారులు హాజరై 16 శాఖలలో 2500 మంది ఉద్యోగుల విభజన పూర్తి చేశారు. ఖాళీల గుర్తింపులో కీలకంగా కృషి చేసిన అధికారులు తుది నివేదికను రూపొందించారు. ఇందులో హోంశాఖలో 21507, విద్యా శాఖలో 22వేలు, వైద్య ఆరోగ్య శాఖలో 10,048, బీసీ సంక్షేమ శాఖలో 3538, గిరిజన సంక్షేమ శాఖలో 1700 గ్రామీ ణాభివృద్ధి శాఖలో 1391 ఇతర ఖాళీలతో కలుపుకుని మొత్తంగా 86,747ఖాళీలను నివేదించారు.

ఈ నివేదికను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రివర్గ ఆమోదానికి పంపింది. ఈ ఫైల్‌పై కేబినెట్‌ ఆమోదం తర్వాత జరిపే భర్తీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను మినహాయించి ప్రత్యక్ష నియామకాల ద్వారా ఏర్పడిన 55వేలకు పైగా నియామకాల భర్తీ దిశగా యోచిస్త్తున్నది. ఈ దిశలో ప్రభుత్వ విభాగాలు, సర్వీస్‌ రూల్స్‌, రోస్టర్‌, రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను, నియామక రూల్స్‌ వంటి వాటిని ఆయా నియామక ఏజెన్సీలకు అందించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత నిర్దేశిత గడువులోగా నోటిఫి కేషన్లు వెల్లడించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఒకదాని వెంట ఒకటి 55వేలకు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేయాలని యోచిస్తోంది.

ఇకపై ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసుకునేలా నెలవారీ క్యాలెండర్‌ దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఖాళీలు ఏర్పడ్డ ఆరు నెలల్లోగా నియామకాలు పూర్తయ్యేలా నిర్దిష్ట కార్యాచరణ చేస్తోంది. ఈ మేరకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో టీఎస్‌పీఎస్సీ సహా ఇతర నియామక సంస్థలు, బోర్డులకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ దిశలో టీఎస్‌పీఎస్సీ, పోలీస్‌ నియామక సంస్థ, వైద్య ఆరోగ్య నియామక సంస్థ, గురుకుల విద్యాలయాల సంస్థలను ఇందులో భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది. ఆ తర్వాత నెలవారీ క్యాలెండర్‌ను రూపొందించి ఎప్పటికప్పుడే ఖాళీలను భర్తీ చేసేలా ఉద్యోగ క్యాలెండర్‌ను రూపొందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నియామకాలకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలో ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేస్తారు. ఒకే పోటీ పరీక్షతో ఆయా సంస్థల పరిధిలోని ఉద్యోగులకు అభ్యర్థులను గుర్తించి అర్హత వారీగా తీసుకుంటారు. మొదట ఈ విధానం ఇంజనీరింగ్‌ విభాగంలో వర్తింపజేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement