Friday, March 29, 2024

యాత్రికుల భద్రతకు చర్యలు, సీఎం ఆదేశాలతో శ్రీనగర్‌కు అధికారులు.. ఏపీ, తెలంగాణ భవన్​లో హెల్ప్‌లైన్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రకృతి విపత్తులో చిక్కుకుపోయిన అమర్‌నాథ్‌ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అమర్‌నాథ్‌ యాత్రలో కుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో రాష్ట్రం నుంచి వెళ్లిన పలువురి యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎంఓ అధికారులు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌తో మాట్లాడారు.

దీంతో అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్న హిమాంశు కౌశిక్‌ను వెంటనే శ్రీనగర్‌ పంపించారు. యాత్రికుల భద్రత, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమన్వయం చేసుకుని, అవసరమైన చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. యాత్రలో చిక్కుకున్న వారి యోగక్షేమాలను బంధువులను తెలుసుకునేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, కాశ్మీర్ పహల్గాం, అనంతనాగ్ ప్రాంతాల హెల్ప్‌లైన్ నంబర్లనూ విడుదల చేశారు. యాత్రికుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, సహాయాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ భవన్, తెలంగాణ భవన్‌లలో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికుల వివరాలు తెలుసుకునేందుకు 011-23384016, 011-23387089కు కాల్ చేయవచ్చు. తెలంగాణ యాత్రికుల సమాచారాన్ని తెలుసుకునేందుకు 01123380556, 01123380558 నంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement