Saturday, April 20, 2024

రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబైకి కఠిన సవాల్‌.. నేడు ల‌క్నోతో కీలక పోరు

ఐపీఎల్‌-16 సీజన్‌లో నేడు (బుధవారం) ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య రెండవ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ జరగనుంది. గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఓడిపోవడంతో.. ముంబై ఇండియన్స్‌కి ప్లే ఆఫ్స్‌లో అవకాశం లభించింది. కాగా, నేడు జ‌ర‌గ‌నున్న మ్యాచ్ లో పటిష్టమైన లక్నోను ఎదుర్కొనేందుకు రోహిత్‌సేన మెరుగైన ప్రదర్శన చేయకతప్పదు. ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబైకి లక్నో నుంచి కఠిన సవాల్‌ ఎదురుకానుంది. లక్నోకి కూడా గతేడాది చేదు అనుభవం గుర్తుంది. ఆర్‌సీబీ చేతిలో ఓటమితో ప్లేఆఫ్స్‌లో భంగపడి టైటిల్‌కు దూరమైంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ కె.ఎల్‌.రాహుల్‌ అందుబాటులో లేనప్పటికీ, క్రునాల్‌పాండ్యా సారథ్యంలో ఇప్పటి వరకు మెరుగైన ఆటతీరును కనబరిచింది.

ముంబైకి బ్యాటింగే బలం..

ఈ కీలక పోరులో ముంబై బ్యాటర్‌ కామెరూన్‌ గ్రీన్‌ను ఏమాత్రం తక్కువగా అంచనావేయడానికి వీల్లేదు. గ్రీన్‌ (381) తోపాటు సూర్యకుమార్‌ (511), రోహిత్‌శర్మ (313), ఇషాన్‌ కిషన్‌ (439) బ్యాటింగ్‌లో కీలక ఆటగాళ్లు. అయితే, లక్నో బౌలింగ్‌ దళాన్ని ఎదురొడ్డి భారీస్కోర్లు చేయడమన్నది ముంబైకి నిజంగా అగ్నిపరీక్షే అవుతుంది. బౌలింగ్‌ విషయానికొస్తే జాసన్‌ బెహ్రెండార్ఫ్‌ (14వికెట్లు) ముంబైకి టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ప్రారంభంలో ఇతను రాణిస్తే ప్రత్యర్థి జోరుకు కళ్లెంపడినట్లే.

- Advertisement -

లక్నో సమతూకం..

లక్నో తరఫున లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ నిలకడగా వికెట్లు తీస్తూ, జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీశాడు. ఇతనితోపాటు నవీన్ ఉల్ హక్‌, అవేశ్‌ఖాన్‌, అమిత్‌మిశ్రా వంటి దిగ్గజాలు లక్నోకు కొండంత అండగా ఉన్నారు. బ్యాటింగ్‌లో కె.ఎల్‌. రాహుల్‌ సేవలు అందుబాటులో లేనప్పటికీ, ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ వల్ల పాండ్యా బృందం సులభంగా ప్లేఆఫ్ల్స్‌కు చేరింది. క్వింటన్‌ డికాక్‌, కైల్‌ మేయర్స్‌, నికోలస్‌ పూరన్‌ వంటి హిట్టర్లు మ్యాచ్‌ ఫలితాన్ని శాసించగల సత్తా ఉన్నవారే.

Advertisement

తాజా వార్తలు

Advertisement