Saturday, November 26, 2022

విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ ఉద్యోగుల‌ భారీ ప్రదర్శన.. బిల్లు వెన‌క్కి తీసుకోవాల‌ని నినాదాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ (సవరణ) బిల్లు, విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రదర్శన చేపట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాలు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ చేరుకున్నాయి. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చీఫ్ ఇంజనీర్ నుంచి లైన్‌మన్ వరకు ప్రతి ఒక్కరూ ఈ ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ మండిపడ్డారు.

- Advertisement -
   

ప్రతిపాదిత బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలన కోసం పంపినప్పటికీ ఆ బిల్లులో పొందుపరిచిన సవరణలతో రైతులు, పేద, మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలు తీవ్రంగా నష్టపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు వైఎస్సార్సీపీ సభ్యులు, బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య, కేరళ ఎంపీ కరీం సహా వివిధ పార్టీల నాయకులు, ట్రేడ్ యూనియన్ల నాయకులు హాజరై విద్యుత్ ఉద్యోగులకు మద్ధతు ప్రకటించారు. విద్యుత్ (సవరణ) బిల్లుతో కేవలం విద్యుత్ ఉద్యోగులకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు కూడా తీవ్ర నష్టం ఏర్పడుతుందని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రతాప్ రెడ్డి, ముత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బిల్లును వెనక్కి తీసుకోవాలి: ఆర్. కృష్ణయ్య
విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ జంతర్ మంతర్ ధర్నాకు హాజరైన వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ (సవరణ) బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశంలోని 28 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రైవేటీకరణతో భవిష్యత్తులో రైతులకు, ఇతర అల్పాదాయ వర్గాలకు ఉచితంగా విద్యుత్ అందించే పరిస్థితి ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఒక్కొక్క రైతు ప్రతి పంప్ సెట్‌కు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు కట్టాల్సి వస్తుందని కృష్ణయ్య అన్నారు. ఫలితంగా వ్యవసాయ ఖర్చులు మరింత భారంగా మారి, ఆహార ధాన్యాలు, నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయని, మొత్తంగా సమాజంలోని సామాన్యుడు పెను భారాన్ని మోయాల్సి వస్తుందని అన్నారు. మరోవైపు విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి అవకాశం ఉండదని, ఫలితంగా 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు నష్టపోతారని ఆయనన్నారు. ప్రైవేటీకరణ ద్వారా అంబానీ, అదానీ, టాటా, జిందాల్, గోయెంకా, టోరన్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు రూ. 200 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా ధారాదత్తం చేయడాన్ని ప్రజలు అంగీకరించరని ఆయన హెచ్చరించారు.

ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయని గుర్తుచేశారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై పోరాడతామని తెలిపారు. పార్లమెంట్‌ను ముట్టడించి, పార్లమెంటుకు విద్యుత్ సరఫరా లేకుండా చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement