Friday, April 19, 2024

ఈవీలపై మారుతీ సుజుకీ దృష్టి.. 2030 కల్లా 6 ఎలక్ట్రిక్‌ కార్లు

దేశంలో వేగంగా ఈవీ వాహనాల వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం టూ వీలర్స్‌ అమ్మకాలు అత్యధికంగా ఉన్నాయి. క్రమంగా పెద్ద కంపెనీలు కూడా ఈవీల మార్కెట్‌లోకి వస్తుండటంతో కార్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ కార్ల అమ్మకాల్లో మార్కెట్‌ లీడర్‌గా ఉన్న మారుతీ సుజుకీ 2030 కల్లా ఆరు ఈవీలను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో టాటా మోటార్స్‌ మాత్రం శరవేగంతో కొత్త ఈవీ కార్లను మార్కెట్‌లోకి తీసుకు వస్తోంది. ప్రస్తుతం ఈవీ కార్ల మార్కెట్‌లో టాటానే నెంబర్‌వన్‌గా ఉంది. ఈవీ వాహనాలను ప్రజలు ఎక్కువ మంది కొనుగోలు చేయాలంటే వాటి ధరలు తగ్గాల్సి ఉందని మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ శశాంక్‌ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. డీ జిల్‌, పెట్రోల్‌ కార్ల ధరలతో పోల్చితే ఈవీ కార్ల ధరలు 60 శాతానికి పైగా ఎక్కువగా ఉన్నాయన్నారు.

- Advertisement -

వీటి ధరలు ఇంత భారీగా ఉండేందుకు ప్ర్‌ధానంగా బ్యాటరీ ధరలే కారణమని ఆయన చెప్పారు. బ్యాటరీల ధరలు తగ్గించేందుకు మారుతీ సుజుకీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈవీ కార్ల వాటా 1 శాతంగా ఉందని శశాంక్‌ శ్రీవాస్తవ చెప్పారు. 2024-25 నాటికి ఇది 3 శాతానికి, 2030 నాటికి 17 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అప్పటికి ఏడాదికి 60 లక్షల కొత్త కార్లు మార్కెట్‌లోకి వస్తే, అందులో 10 లక్షల వరకు ఈవీ కార్లు ఉంటాయన్నారు. మార్కెట్‌ వాటా మారుతీ సుజుకీ బలాల్లో ఒకటని ఆయన చెప్పారు. ఎస్‌యూవీ విభాగంలో మరింత మార్కెట్‌ వాటా పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో కార్ల వినియోగం రానున్న కాలంలో మరింత పెరుగుతుందన్నారు.

2022లో దేశంలో 38 లక్షల కార్లు విక్రయాలు జరిగాయన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 60 లక్షలకు చేరుతుందన్నారు. మారుతీ సుజుకీ లేటుగా ఈవీ మార్కెట్‌లో ప్రవేశిస్తున్నప్పటికీ, సంతృకరమైన ధరల్లో కస్టమర్లకు వీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాటరీ ధరలు తగ్గితే ఈవీ కార్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మారుతీ తో పాటు, మహీంద్రా అండ్‌ మహీంద్రా, వోక్సోవ్యాగన్‌ కూడా పెద్ద సంఖ్యలో ఈవీ కార్లను రానున్న రోజుల్లో మార్కెట్‌లోకి తీసుకు రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement