Friday, April 19, 2024

కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకీ టాప్‌..

ఈ నవంబర్‌ నెలలో ప్యాసింజర్‌ కార్ల అమ్మకాల్లో మారుతీ సుజుకీ, హ్యుండాయ్‌ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. నవంబర్‌లో మారుతీ సుజుకీ 1.32 లక్షల కార్లను విక్రయించింది. హ్యుండాయ్‌ 48,002 కార్లను విక్రయించింది. ఈ రెండు కంపెనీలు గత సంవత్సరం ఇదే నెలలో మారుతీ సుజుకీ 1.09 లక్షలు, హ్యుండాయ్‌ 37,001 కార్లను విక్రయించింది. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యూఫాక్చరర్స్‌(ఎస్‌ఐఏఎం-సైమా) తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్‌- నవంబర్‌ మధ్యకాలంలో మారుతీ సుజుకీ 10.67 లక్షల యూనిట్లను, హ్యుండాయ్‌ 3.81 లక్షల యూనిట్లను విక్రయించాయి. ఈ రెండు కంపెనీల తరువాత అమ్మకాల్లో మహేంద్రా అండ్‌ మహేంద్రా, కియా మోటార్స్‌, హోండా కార్స్‌, టాయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ కంపెనీలు ఉన్నాయి.

నవంబర్‌ నెలలో మొత్తం అన్ని కంపెనీల ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు 2.76 లక్షలుగా ఉన్నాయని సైమా తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంలో 2.15 లక్షల కార్ల అమ్మకాలు జరిగాయి. ఈ నవంబర్‌లో జరిగిన 2.76 లక్షల యూనిట్ల అమ్మకాల్లో ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు 1.30 లక్షలు ఉన్నాయి. 1.38 లక్షలు యూటిలిటీ వాహనాలు, 7,309 వ్యాన్లు ఉన్నాయి. 2022-23 సంవత్సరం ఏప్రిల్‌-నవంబర్‌ కాలంలో మొత్తం 25.04 లక్షల ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు జరిగాయని సైమా వెల్లడించింది.

- Advertisement -

గత సంవత్సరం ఇదే కాలంలో 18.29 లక్షల వాహనాల అమ్మకాలు జరిగాయి. 25.04 లక్షల వాహనాల్లో 11.51 లక్షలు ప్యాసింజర్‌ కార్లు, 12.62 లక్షలు యుటిలిటీ వాహనాలు, 90,572 వ్యాన్ల అమ్మకాలు జరిగినట్లు తెలిపింది. మారుతీ సుజుకీ నవంబర్‌లో 1,32,943 యూనిట్లు విక్రయించింది. ఏప్రిల్‌-నవంబర్‌ కాలంలో 10,67,282 యూనిట్లను విక్రయించింది. హ్యుండాయ్‌ కంపెనీ ఈ నవంబర్‌లో 48,002, ఏప్రిల్‌-నవంబర్‌ కాలంలో 3,83,008 యూనిట్లు విక్రయించింది. అమ్మకాల్లో మూడో స్థానంలో ఉన్న మహేంద్రా అండ్‌ మహేంద్రా కంపెనీ ఈ నవంబర్‌లో 30,392 యూనిట్లను, ఏప్రిల్‌-నవంబర్‌ కాలంలో 2,31,413 యూనిట్లను విక్రయించింది. నాలుగో స్థానంలో ఉన్న కియా మోటార్స్‌ నవంబర్‌లో 24,025 యూనిట్లను, ఏప్రిల్‌-నవంబర్‌ కాలంలో 1,79,310 యూనిట్లను విక్రయించింది. ఐదో స్థానంలో ఉన్న టాయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ నవంబర్‌ నెలలో 11,728, ఏప్రిల్‌-నవంబర్‌ కాలంలో 1,16,225 యూనిట్లను విక్రయించింది. 6వ స్థానంలో ఉన్న హోండా కార్స్‌ నవంబర్‌ నెలలో 7,051, ఏప్రిల్‌-నవంబర్‌ కాలంలో 53,433 యూనిట్లను విక్రయించింది. నవంబర్‌లో ప్యాసింజర్‌ కార్లతో పాటు, టూ వీలర్స్‌ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి.

ఈ నవంబర్‌ నెలలో 12.36 లక్షల ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం నవంబర్‌లో 10.61 లక్షల టూ వీలర్స్‌ అమ్మకాలు జరిగాయి. త్రీ చక్ర వాహనాల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. గత సంవత్సరం నవంబర్‌లో 22,551 త్రీచక్ర వాహనాల అమ్మకాలు జరిగితే ఈ నవంబర్‌ నెలలో 45,664 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ నవంబర్‌లో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు గతంలో ఎన్నడూ లేనంతగా 2022-23 సంవత్సరంలో జరిగాయని సైమా డైరెక్టర్‌ జనరల్‌ రాజేష్‌ మీనన్‌ చెప్పారు. త్రీ వీలర్స్‌ అమ్మకాలు మాత్రం ఇంకా 2010-11 స్థాయికి రాలేదన్నారు. టూ వీలర్స్‌ అమ్మకాలు కూడా 2016-17 నాటి కంటే తక్కువగానే నమోదయ్యాయని చెప్పారు. ప్రధానంగా పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం రేట్లు ప్రధానంగా కస్టమర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయని, దీని ప్రభావం టూ, త్రీ వీలర్‌ అమ్మకాలపై పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement