Friday, April 26, 2024

బీఆర్‌ఎస్‌లో చేరేందుకు తరలివచ్చిన ముఖ్య నేతలు… తెలంగాణ భవన్‌ వద్ద హోరెత్తిన నినాదాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) లో చేరేందుకు ఆంధ్రా సమాజం హైదరాబాద్‌ కదిలివచ్చింది. రిటైర్డ్‌ ఐఎఎస్‌ తోట చంద్రశేఖర్‌., రావెల కిశోర్‌ బాబు, రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ పార్థసారథి, టీజే ప్రకాష్‌ తదితర ప్రముఖ నేతలు సోమవారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ చేరికల నేపథ్యంలో గుంటూరు, విజయవాడ తదితర ఆంద్రా ప్రాంతాలనుంచి వేలాదిగా అభిమానులు కదలివచ్చారు. హైదరాబాద్‌ వైపు జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్‌ జెండాలతో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తల వాహన శ్రేణి తరలివస్తున్న దృశ్యాలు కనిపించాయి.

ఏపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బిఆర్‌ఎస్‌ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆంధ్రా ప్రజల దృష్టి అంతా రైతులకు బిసీ ఎస్సీ ఎస్టీ ల అభివద్ధి సంక్షేమం దిశగా తెలంగాణలో నడుస్తున్న పాలనమీద పడింది. ఆంధ్రా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అక్కడి రాజకీయ నేతలు సీనియర్లు, జర్నలిస్టులు, ఐఎఎస్‌ లు తదితర మేధావి వర్గాలు, మరికొంత మంది ముఖ్య నేతలు బిఆర్‌ఎస్‌ లో చేరేందుకు సిద్దమవుతున్నారు.

తెలంగాణ భవన్‌ వద్ద మిన్నంటిన నినాదాలు…

- Advertisement -

ఏపీ నేతల చేరికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది. నినాదాలు మిన్నంటాయి. జై కేసీఆర్‌, జై బీఆర్‌ఎస్‌ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు. దీంతో తెలంగాణ భవన్‌ పరిసరాలన్నీ గులాభీ శోభను సంతరించుకున్నాయి. నగరంలో పలు కూడళ్లు, ముఖ్య ప్రాంతాల్లో గులాబీ ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ మంత్రి రావెల, తోట చంద్రశేఖర్‌, పార్థసారథి బీఆర్‌ఎస్‌ లో చేరుతున్న హోర్డింగ్‌లు కనిపించాయి. తెలంగాణ భవన్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం పోలీసులకు, భద్రతా సిబ్బందికి తలకుమించిన భారంగా పరిణమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement