Friday, April 19, 2024

Big story | మన్యం కొండకు మహర్దశ.. త్వరలోనే రోప్‌ వే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దట్టంగా విస్తరించిన నల్లమల దండకార్యణ్యంలో అంతుచిక్కని రహస్యాలు, ఆలయాలు,గోపురాలు, చరిత్రప్రాధాన్యత గల అంశాలు అనేకం ఉన్నాయి. ఎత్తౖౖెన కొండగుహల్లో కోలువుతీరిన ఆలయాలు అగుపిస్తాయి. అయితే దండకారణ్యంలోని కొండగుహల్లో కొలువుతీరిన ఆలయాలు అనేకం ఉన్నప్పటికీ మన్యంకొండకు ప్రత్యేకత ఉంది. తెలంగాణ తిరుపతిగా భాసిల్లుతున్న మన్యంకొండ అభివృద్ధికి టూరిజం కార్పొరేషన్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రధానంగా ఎతైన కొండల్లో కొలువు తీరిన స్వామిని దర్శించుకునేందుకువచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యంకోసం ఘాట్‌ రోడ్ల నిర్మాణంతో పాటుగా సుమారు అరకిలోమీటరు పొడవులో రెండు కొండలను కలుపుతూ రోప్‌ వే నిర్మించేందుకు టెండర్లను ఖరారు చేశారు.

వీటితో పాటుగా దేలాలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యలకోసం కొండపై విడిది గృహాలు, మమబూబ్‌ నగర్‌ పట్టణంలో టూరిజం కార్పొరేషన్‌ బడ్జెట్‌ హోటల్‌ నిర్మిస్తుంది. మన్యం కొండకు 600ల సంవత్సరాల చరిత్రఉంది. తమిళనాడులోని ప్రముఖ వైష్ణవక్షేత్రం శ్రీరంగంసమీపంలోని అళహరి గ్రామానికి చెందిన కేశవయ్యకు శ్రీనివాసుడు కలలో కనిపించి కృష్ణా నదితీరంలో మన్యంకొండపై వెలిశానని చెప్పడంతో కేశవయ్య కుటుంబసభ్యులతో కలిసి మన్యం కొండ చేరుకుని నిత్యసేవాకార్యక్రమాలు నిర్వహించినట్లు ఆధారాలు ఉన్నాయి. అలాగే కాకతీయుల ఏలుబడిలో కొంతమేరకు అభివృద్ధి కాగా అనేకమంది సంస్థానాధీశులు మన్యంకొండ ఆలయాభివృద్ధికి కృషి చేశారు.

సుప్రసిద్ధ వాగ్గేయకారుడు హనుమద్దాసు ఇక్కడే 300 క్రీర్తనలను రచించారు. గద్వాల,వనపర్తి సంస్థానాధీశులు మన్యం కొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటుగా అనేక కానుకలు,ఆలయ నిర్వహణకు వందలాది ఎకరాల భూమిని స్వామివారి సమర్పించుకున్నారు. తెలంగాణలో ప్రముఖపుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న మన్యం కొండ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడంతోపాటుగా రూ. 50 కోట్లతో రోప్‌ వే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. తిరుపతి వెళ్లలేని భక్తులు మన్యం కొండను దర్శిస్తే తిరుపతికి వెళ్లిన పుణ్యం లభిస్తోందనే నమ్మకం ప్రజల్లో ఉండటంతో భక్తుల సంఖ్య లక్షల్లోకి చేరకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైంది.

- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలయ అభివృద్ధికోసం ప్రత్యేక చొరవతీసుకోవడంతో ప్రస్తుతం రూ. 4కోట్ల 79 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు రూ.52 లక్షల వ్యయంతో సెంట్రల్‌ లైటింగ్‌ , దేవాలయం ముఖ ద్వారం దగ్గర రూ. 27లక్షల 65వేలతో చెరువుకట్ట అభివృద్ధి పనులను పూర్తి చేశారు. భక్తుల సౌకర్యాలకోసం రూ. 2కోట్ల 2లక్షల వ్యయంతో నిర్మించిన 18 వసతి గృహాలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.

బ్రహ్మోత్సవాల నాటికి రోప్‌ వే..

తెలంగాణ తిరుపతిగా బాసిల్లుతూ లక్షలాది మంది భక్తుల కోరికలను తీరుస్తున్న మన్యం కొండ దేవాలయానికి రోప్‌ వే నిర్మించనున్నట్లు రాష్ట్ర టూరిజం, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. అలాగే తెలంగాణలో తొలిసారిగా రోప్‌ వే నిర్మాణం మన్యంకొండతోనే ప్రారంభం అవుతుందన్నారు.కొండలను అనుసంధానం చేస్తూ నిర్మించనున్న రూప్‌ వే తో నల్లమల అందాలు ద్విగుణీకృతం అవుతాయని చెప్పారు. అలాగే భారీ కళ్యా ణ మంటపం నిర్మించి మరింత సౌకర్యవంతం చేయనున్నట్లు తెలిపారు.

కొండ దిగువన ఉన్న అలివేలు మంగ దేవాలయం సమీపంలో నిర్మించే త్రీస్టార్‌ హోటల్‌ భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసఆర్‌ పర్యాటకరంగాభువృద్ధికి అధికప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంగా అవతరించినప్పటినుంచి పర్యాటక రంగాభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాచన చరిత్రగల ఆలయాలు, కట్టడాలు అనేకం ఉన్నాయన్నారు. రామప్పకు యునేస్కోగుర్తింపుతో తెలంగాణ ప్రపంచానికి పరిచయమైందన్నారు. అయితే రాష్ట్రంలో యునెస్కో గుర్తింపు స్థాయి ప్రాచన సంపద విస్తృతంగా ఉందని చెప్పారు.

టెంపుల్‌ టూరిజానికి ప్రాధాన్యత..

మన్యం కొండ అభివృద్ధి వేగవంత మవుతుందని పర్యాటకాభివృద్ది కార్పొరేషన్‌ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ చెప్పారు. తెలంగాణలో కాకతీయ,రెడ్డి, విష్ణుకుండినులు నిర్మించిన అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నప్పటికీ సమైక్యపాలకులు ఆలయాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆలయాలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపట్టడంతో భక్తుల సంఖ్య పెరిగిందన్నారు. యాదాద్రి నిర్మాణంతో లక్షల సంఖ్యలో భక్తులు పెరిగరన్నారు. యాదాద్రి వాస్తురీతులు, శిల్ప రీతుల పరిశీలన కోసం విదేశీయులు వస్తుండటంతో టెంపుల్‌ టూరిజానికి ప్రాధాన్యత పెరిగిందన్నారు. మన్యం కొండ రోప్‌ వే నిర్మాణంతో తెలంగాణ టెంపుల్‌ టూరిజం ప్రాధాన్యత ద్విగుణీ కృతమవుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement