Thursday, April 25, 2024

జూన్‌ 8న జమ్మూలో శ్రీ‌వారి ఆలయ మహాసంప్రోక్షణ

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి: దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మప్రచారాన్ని పెద్ద ఎత్తున నర్వహిస్తున్న టిటిడి ఉత్తరాదిలోని జమ్మూలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం నిర్మించింది. వైఖానస ఆగమోక్తంగా, సర్వాంగ సుందరంగా ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. మాతవైష్ణోదేవి దర్శనం కోసం జమ్మూకు వచ్చే భక్తులకు శ్రీవారి ఆలయ సందర్శన మరో ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వనుంది. జమ్మూలోని మజీన్‌ గ్రామంలో టిటిడి నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ జూన్‌ 8 న జరగనుంది.

ఇందుకోసం జూన్‌ 3 వ తేది నుంచి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్‌3 న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఆచార్య వరణం,పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. జూన్‌ 4 న ఉదయం 8 నుంచి 11 గంటల వరకు పంచగవ్యప్రాసన, వాస్తు హోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అగ్నిప్రతిష్ట, కుంభ స్థాపన, కుంభారాధన, విశేష హోమం నిర్వహిస్తారు. జూన్‌ 5 న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, అక్షిన్మోచనం, నవకలశ స్నపనం, పంచగవ్యాధివాసం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు.

- Advertisement -

జూన్‌ 6 న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, నవకలశ స్నపనం, క్షీరాధివాసం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు. జూన్‌ 7 న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, జలాధివాసం, రత్నన్యాసం, ధాతున్యాసం, విమాన కలశ స్థాపన బింబస్థాపన (విగ్రహప్రతిష్ట), సాయంత్రం మహాశాంతి తిరుమంజనం, రాత్రి శయనాధివాసం నిర్వహిస్తారు. జూన్‌ 8 న ఉదయం 7.30 నుంచి 8.15గంటల వరకు మిధున లగ్నంలో మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. టిటిడి చైర్మెన్‌ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఏవి.ధర్మారెడ్డితో పాటు పలువురు స్థానిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement