Friday, April 26, 2024

మాగుంట రాఘవ బెయిల్‌ పిటిషన్ విచారణ 25కు వాయిదా..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న మాగుంట రాఘవ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై గురువారం రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులోని స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. రాఘవ రెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే విచారణ సందర్భంగా తిహార్ జైలు నుంచి రాఘవను వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరుపర్చాల్సినప్పటికీ జైలు అధికారులు ఆ పనిచేయలేదు. దీంతో స్పెషల్ కోర్టు జడ్జి ఎం.కే. నాగ్‌పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి వాయిదా తేదీన తప్పనిసరిగా రాఘవను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపర్చాలని జైలు అధికారులను ఆదేశించారు. విచారణను మార్చి 25కు వాయిదా వేశారు. ఇప్పటికే రాఘవరెడ్డి తరఫు వాదనలు ముగియడంతో తదుపరి విచారణ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) తన వాదనలు వినిపించనుంది.

- Advertisement -

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో రూ. 100 కోట్ల ముడుపులను ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ నేత విజయ్ నాయర్‌కు అందించారన్న అభియోగాలపై మనీలాండరింగ్ చట్టం కింద ఫిబ్రవరి 11న మాగుంట రాఘవరెడ్డి ఈడీ అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు (వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి, అరబిందో గ్రూపు శరత్‌చంద్ర రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) ఒక గ్రూపుగా ఏర్పడి ఢిల్లీ మద్యం వ్యాపారంలో 30 శాతానికి పైగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారని, ఈ క్రమంలో ముందుగానే ముడుపులు చెల్లించి, అందుకు తగిన ప్రయోజనాలు, ప్రతిఫలాలు పొందేందుకు ఇండో-స్పిరిట్స్ సంస్థను ఒక వాహనంగా ఉపయోగించుకున్నారని ఈడీ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈడీ అరెస్టు చేసి, తన కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. అనంతరం కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధిచడంతో రాఘవ రెడ్డి అప్పటి నుంచి తిహార్ జైల్లో ఉన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement