Thursday, April 25, 2024

ఏ పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉందాం.. తప్పుడు సమాచారవ్యాప్తిని అడ్డుకుందాం : మన్సుఖ్ మాండవియా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కోవిడ్-19 కొత్త వేరియంట్ ముప్పు నేపథ్యంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందామంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవియా అన్నారు. ఇదే సమయంలో లేనిపోని భయాలు సృష్టిస్తూ జరిగే తప్పుడు సమాచార వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. చైనా సహా మరికొన్ని దేశాల్లో ఆస్పత్రుల సామర్థ్యాన్ని మించి నమోదవుతున్న కోవిడ్-19 కొత్త వేరియంట్ కేసుల నేపథ్యంలో భారత ప్రభుత్వం సంసిద్ధతను పరిశీలించేందుకు మంగళవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. కోవిడ్-19 చికిత్స కోసం ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల సంసిద్ధతను నిర్ధారించడమే ఈ కసరత్తు ప్రధానోద్దేశమని కేంద్ర మంత్రి మాండవియా తెలిపారు.

మాక్ డ్రిల్‌లో స్వయంగా పాల్గొన్న ఆయన మంగళవారం ఉదయం గం. 10.45 సమయంలో న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తాను ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రులతో కోవిడ్-19 పరిస్థితి, సంసిద్ధత గురించి సమీక్షించానని తెలిపారు. ఈ క్రమంలో ఆసుపత్రులలో సంసిద్ధత చాలా ముఖ్యమైనదని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు మాక్‌ డ్రిల్స్‌ ద్వారా తమ సంసిద్ధతను పరిశీలించడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు.

మాక్ డ్రిల్‌లో భాగంగా సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ విభాగాల అధిపతులు, సిబ్బందితో అనధికారింగా సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు, నర్సులు, భద్రత, పారిశుద్ధ్య సేవల అధిపతులతో సుమారు గంటపాటు ఆయన చర్చించారు. ఆసుపత్రి నిర్వహణలో నాణ్యత, వైద్య విధానాలు,  నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య ప్రక్రియలు, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలపై వారిచ్చిన పలు సూచనలను విన్నారు. మహమ్మారి సమయంలో నిరంతరం సేవలను అందిస్తూ పనిచేసినవారు తమ గతానునుభవాలను కేంద్ర మంత్రితో పంచుకున్నారు. ప్రతి వారం తమ బృందాలను కలవాలని, అత్యుత్తమ ఫలితాలను నిర్ధారించడానికి వారి పనితీరును అంచనా వేయాలని డాక్టర్ మాండవియా విభాగాధిపతులకు సూచించారు.

- Advertisement -

కోవిడ్ మహమ్మారి సమయంలో వైద్యులు ఆదర్శప్రాయంగా పనిచేసినందుకు ఆయన ప్రశంసించారు. అదే సమయంలో ఈ మహమ్మారి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు తగిన నివారణ చర్యలను అనుసరించాలని కోరారు. అప్రమత్తంగా ఉండాలని, అదే సమయంలో ధృవీకరించని సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కొత్త రకం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా కేసులు పెరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో చికిత్సను అందించే పరికరాలు, మందులు, మెడికల్ ఆక్సిజన్, మానవ వనరుల పరంగా మొత్తం కోవిడ్ వైద్య కార్యాచరణ సంసిద్ధత తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయెల్, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీఎల్ షేర్వా, శానిటేషన్ తో సహా వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement