Wednesday, April 17, 2024

రైతులకు భూమి ఆరోగ్య కార్డులు.. పంటల మార్పిడికి కీలకం భూసార పరీక్షలు…

వ్యవసాయ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో పంటల మార్పిడి ప్రధానాంశంగా మారడంతో పంటలను మార్చాలంటే ముందుగా భూ సార పరీక్షలు ముఖ్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇందుకోసం వ్యవసాయ భూముల్లో భూ సార పరీక్షలు జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు భూముల్లోని మట్టిని పరీక్షల కోసం తీశారు. తాజాగా భూసార పరీక్షలు చేయడంతో పాటు పరీక్షల అనంతరం వచ్చిన రిపోర్టు ఆధారంగా ఆయా భూముల్లో ఏ పంటలు సాగుచేసుకోవచ్చు, సాగు చేసిన పంటలకు ఎంతమేరకు ఎరువులు వినియోగించవచ్చనే వివరాలు కూడా తెలపనున్నారు. ఇదే సమయంలో భూసార పరీక్షల కోసం కేంద్ర ప్రభుత్వం గత సీజన్‌ చివరి నుంచి ”భూమి పోషణ్‌ అభియాన్‌” కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీం కింద కేంద్రం కొన్ని నిధులను భూసార పరీక్షలకు వెచ్చించనుంది. ప్రస్తుతం భూ సార పరీక్షలకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 60శాతాన్ని భరిస్తుండగా, కేంద్రం 40శాతాన్ని వెచ్చిస్తోంది. తాజాగా తీసుకొచ్చిన భూమి పోషణ్‌ అభియాన్‌లోనూ కేంద్రం 40శాతం వాటాను ఖర్చుచేయనుంది.

2021-22లో 31,200 శాంపిల్స్‌ సేకరణ..

వాస్తవానికి భూములకు సంబంధించి ప్రతి సీజన్‌లోనూ అధికారులు భూ పరీక్షలను చేస్తున్నప్పటికీ, పంటల మార్పిడి అంశం తెరమీదకి రావడంతో సాగుచేయించదల్చిన పంటలకు సంబంధించి ఏ భూముల్లో ఏ పంటలు సాగుచేయిస్తే దిగుబడి బాగుంటుందనే అంశంపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం భూసార పరీక్షలను ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. 2021-22 సీజన్‌లో భూ సార పరీక్షల కోసం 31,200 శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. సేకరించిన నమూనాల రిపోర్టులను రైతులకు ఇవ్వడంతో పాటు, భూమి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై సమగ్ర వివరాలను తెలుపుతారు. సీజన్‌లో తీయాల్సిన వాటికన్నా తక్కువగా శాంపిల్స్‌ను తీశారని అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. అయితే భూ సార పరీక్షలకు సంబంధించి రైతుల్లో పూర్తిస్థాయి అవగాహనను పెంపొందించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

భూమి పోషణ్‌ అభియాన్‌ కింద 5లక్షల నమూనాలు..

భూమి పోషణ్‌ అభియాన్‌ పథకం కింద కేవలం లక్ష శాంపిల్స్‌ మాత్రమే తీసేందుకు అవకాశం ఉందని ప్రణాళికలు కేంద్రానికి నివేదించారు. కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో పరీక్షల్లో జాప్యం జరగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు సంబంధించి మార్చి, ఏప్రిల్‌లో భూ సార పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ సీజన్‌కు సంబంధించి 5 లక్షల శాంపిల్స్‌ను సేకరించేలా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రానికి నివేదికలు పంపనున్నారు.

- Advertisement -

సాయిల్‌ హెల్త్‌ కార్డు జారీ..

భూ సార పరీక్షలు చేయడంతో పాటు రైతులకు భూమి హెల్త్‌ కార్డులు అందించనున్నారు. ఈ హెల్త్‌ కార్డుతో అప్పటివరకు రైతులు ఏ పంటలు సాగుచేశారు. భవిష్యత్‌లో ఎలాంటి పంటలు సాగు చేసేందుకు ఆ భూమి అనుకూలంగా ఉంటుందనే వివరాలు హెల్త్‌కార్డులో పొందుపరచనున్నారు. పంటల సాగుతో పాటు సాగుచేయనున్న పంటలకు సంబంధించి ఏ ఎరువులు వినియో గించాలన్న వివరాలను సైతం కార్డులో నమోదుచేస్తారు. దీంతో రైతులు సాగుచేయదల్చిన పంటలు, వాటికి వినియోగించాల్సిన ఎరువుల వివరాలు ఉండడంతో అధిక ఎరువుల వినియోగానికి స్వస్థి పలకొచ్చని అధికారులు భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement