Saturday, April 20, 2024

ఆక్సిజన్ లేక చనిపోవడం మారణహోమంతో సమానం

కరోనా బాధితులు ఆక్సిజన్ అందక చనిపోతున్నారన్న విషయం నిజంగా మారణ హోమం వంటిదేనని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు పాలకులే బాధ్యత వహించాలని సూచించింది. ఆక్సిజన్‌ను సరఫరా చేయలేకపోవడం నేరపూరిత చర్యేనని అభిప్రాయపడింది. సప్లయ్ చైన్‌ను నిర్వహించలేని అధికారులు, నేతలు అసమర్థులేనని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఆక్సిజన్ లేకుండా కరోనా బాధితులు మరణిస్తున్నారని వచ్చిన వార్తలు, ప్రచారంపై స్పందించిన జస్టిస్ సిద్ధార్ద్ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్ ల ధర్మాసనం, కరోనా పరిస్థితులపై దాఖలైన పలు పిటిషన్‌లను విచారించింది.

లక్నో, మీరట్ జిల్లాల్లో ప్రాణ వాయువు సరఫరా అందక పలువురు మరణించగా, అన్ని కేసుల్లోనూ విచారణకు ఆదేశిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. క్వారంటైన్ సెంటర్లలో పరిస్థితిని వెంటనే సమీక్షించాలని, అవసరార్థులకు ఆసుపత్రుల్లో బెడ్లను, ఆక్సిజన్, వెంటిలేటర్లను అందించాలని ఆదేశించింది. ‘ఆక్సిజన్ అందక రోగులు మరణిస్తున్నారని విని మేము చాలా బాధపడుతున్నాం. ఇది మా మనసును కలచి వేస్తోంది. ఇది నిజంగా మారణ హోమం కన్నా తక్కువేమీ కాదు. మెడికల్ ఆక్సిజన్ ను నిర్వహించాల్సిన వారు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు.. ఈ సమయంలో ప్రజలు ముఖ్యంగా మహమ్మారి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement