Saturday, April 20, 2024

ఈటలపై భగ్గుమన్న కార్మిక లోకం

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఈటల రాజేందర్ తన రాజకీయ లబ్ది కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. ఆర్టీసీ సహా అనేక కార్మిక సంఘాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని గౌరవ అధ్యక్షురాలిగా ఉండాలని కోరుతున్నాయని, ఎంపీగా, ఎమ్మెల్సీగా కవిత పనిచేస్తున్న విధానమే ఇందుకు కారణమని వివిధ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

ఈటల అనుచిత వ్యాఖ్యలపై సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ గౌరవాధ్యక్షురాలిగా ఉండాలని తామంతా ఎమ్మెల్సీ కవితని కోరామని, సీఎం కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని ఎమ్మెల్సీ కవిత తెలిపారన్నారు. ఆర్టీసీకి ఎమ్మెల్సీ కవిత  గౌరవ అధ్యక్షురాలిగా ఉంటే తప్పేంటని, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పబ్లిక్ సెక్టార్ ఆస్తులను కాపాడటానికి 15 రోజులు పాటు కవిత ఢిల్లీలో దీక్ష చేసిన విషయం మీకు తెలియదా అని థామస్ రెడ్డి ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ కాపాడుతున్నారన్న థామస్ రెడ్డి.. ఇటీవలి బడ్జెట్ లో ఆర్టీసీకి రూ. 3 వేల కోట్లు కేటాయించారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, మరి ఈటల రాజేందర్, ఏ ఆత్మగౌరవంతో బీజేపీ లోకి వెళ్తున్నారని థామస్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీలో చేరి సింగరేణి, ఆర్టీసీ, ఎల్ ఐసీ లాంటి సంస్థలను ఈటల రాజేందర్ ఎలా కాపాడుతారని, బడుగులకు ఏ విధంగా న్యాయం చేస్తారని థామస్ రెడ్డి నిలదీశారు. బీజేపీలో చేరి కేంద్ర రవాణా బిల్లును రద్దు చేయిస్తారా ? ఆర్టీసీని కాపాడుతారా? అని ఈటలను సూటిగా ప్రశ్నించారు.

హుజురాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ ప్రభుత్వ ఫలాలను అందించాడు తప్ప, సొంతంగా ఏమీ చేయలేదని, రాజకీయ లబ్ది కోసం ఈటల అసత్యాలు మాట్లాడం తగదని టీఎంయూ నేతలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు చొరవ వల్లే టీఎంయూ ఏర్పడిందని, టీఎంయూ ఏర్పాటులో‌ ఈటల రాజేందర్ పాత్ర లేదని నేతలు స్పష్టం చేశారు. బలహీన వర్గాల నేతగా చెప్పుకుని, అక్రమాలకు పాల్పడింది ఈటల రాజేందర్ అని, ఆత్మగౌరవం కోసం ఉద్యమంలో నిజమైన త్యాగాలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని థామస్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ఆర్టీసీ కార్మికులం ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని టీఎంయూ నేతలు స్పష్టం చేశారు.

మరోవైపు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేందర్ పై సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలోని 11 రీజియన్లలో ఈటల దిష్టిబొమ్మను దహనం చేసిన కార్మికులు, కవిత గౌరవాధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత మాత్రమే చరిత్రలో ఎన్నడూలేని విధంగా కార్మికులకు 60కి పైగా హక్కులను సాధించడం జరిగిందని టీబీజీకేఎస్ నాయకులు పేర్కొన్నారు. జాతీయ కార్మిక సంఘాల పెండింగ్‌లో ఉంచిన డిపెండెంట్‌ల‌కు మూడు వేల 400 మందికి ఉద్యోగాలు ఇవ్వడం, కారుణ్య నియామకాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, నోటిఫికేషన్ల ద్వారా 4 వేల 500 పైచిలుకు ఉద్యోగాలు, 100 శాతం పవర్ చార్జీల రద్దు, ఉచిత ఏసీ కనెక్షన్లు ఇలా ఎన్నో హక్కులను కవిత సారథ్యంలో సాధించుకున్న‌ట్లు తెలిపారు. 20 ఏండ్లు టీఆర్ఎస్ ద్వారా అనేక పదవులు అనుభవించిన ఈటల రాజేందర్.. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement