Friday, February 3, 2023

సిద్దిపేటలో కూడవెల్లి జాతర ప్రారంభం..

ప్రకృతి అందాల నడుమ ఆధ్యాత్మిక కేంద్ర మై విరాజిల్లుతున్న రామలింగేశ్వరాలయం. ఓవైపు జీవ నది, నది ఒడ్డున శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, శివ పంచాయతన క్షేత్రాలు, పృకృతి అందాలను ఆస్వాదించేందుకు, ఆధ్యాత్మికతతో మనసును ఉల్లాస పరుచుకునేందుకు అనువైన ప్రాంతం. కూడవె ల్లి రామలింగేశ్వరాలయంగా ప్రసిద్ధిగాంచిన శివకేశవుల నిలయంలో నేటి నుంచి నాలుగు రోజుల జాతర సాగనుంది. మాఘమ అమావాస్య రోజున పుణ్య స్నానాలు, పూర్వీకులకు పిండ ప్రదానాలు, దేవాలయ సందర్శన అన్నీ ఒకే చోట ఉండే ప్రాంతం కూడవెల్లి జాతరకు మనమూ వెళ్ళొద్దాం రండి….
– ప్రభన్యూస్‌, దుబ్బాక

ప్రముఖ పుణ్యక్షేత్రం, హరి హర నిలయమై భక్తుల కోర్కెలు నెరవేరుస్తున్న కూడవె ల్లి రామలింగేశ్వర స్వామి ఆలయ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర సాగుతుంది. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని నూతన మండలంగా ఏర్పాటైన అక్బర్‌పేట-కూడవెల్లి మండలం రామేశ్వరం పల్లి శివార్లలోని కూడవెల్లి క్షేత్రం ఈ ప్రాంతంలోనే జీవనది ఒడ్డున వెలసిన ప్రముఖ పుణ్య క్షేత్రమై విరాజిల్లుతోంది. కూడవెల్లి రామలింగేశ్వరాలయ ప్రాంతం శైవులు, వైష్ణవుల ఆరాధనా ప్రాంతంగా భక్తుల పూజలందుకొంటోంది. స్వయంగా సీతారాములచే ప్రతిష్ఠింప బడి, పూజలందుకున్న శివలింగం గనుక రామలింగేశ్వరాలయంగా ప్రసిద్ధి గాంచింది. ప్రతి సంవత్సరం పుష్య బహుళ అమావాస్య నుంచి నాలుగు రోజుల పాటు ఈ జాతర సాగుతుంది. మాఘ అమావాస్య రోజున జీవనది అయిన కూడవెల్లి వాగు (మాండవ్య వాగు)లో భక్తులు పుణ్య స్నానాలు చేసి, స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ క్షేత్ర విశేషాలకు సంబంధించి పూర్వ కాలం నుంచి ఒక కథ స్థల పురాణంగా ప్రచారంలో ఉంది. శ్రీరాముడు రావణునితో యుద్ధం చేసి, రావణున్ని సంహరించిన అనంతరం లంక నుంచి అయోధ్యకు పయనమైనాడు. బ్రాహ్మణుడైన రావణున్ని చంపినందువల్ల కలిగే బ్రహ్మహత్యా పాతక నివారణ కోసం ఏదైనా జీవనది ఒడ్డున శివలింగానికి పూజలు చేయాలని తమ కులగురువు అగస్త్య మహాముని సూచనల మేరకు కూడవెల్లి వాగు ఒడ్డున ఆగి , శివార్చనకు ఉపక్రమించారు. శివార్చన కోసం కాశీ నుంచి శివలింగాన్ని తేవడానికి వెళ్ళిన అహనుమంతుడు రావడం ఆల స్యం కావడంతో అర్చనకు ఆలస్యం కాకుండా సీతాదేవి ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందట. ఈ లోగా హనుమంతుడు కూడా శివలింగంతో రావడంతో ఈ రెండు శివలింగాలకు పూజలు నిర్వహించారని చెప్పుకుంటారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపారట. ఈ వాగు ఒడ్డున శివలింగాలు వెలసిన ప్రాంతంలో మాండ వ్యుడు అనే మహాముని తపస్సు చేసుకునేందుకు ఆశ్రమాన్ని ఏర్పరుచుకున్నాడు. మాండవ్య మహాముని నివసించిన ప్రాంతం క నుక ఈ వాగును మాండవ్య వాగు అని ప్రచారంలోకి వచ్చింది. భక్తుల రాకపోకలు పెరగడంతో ఇక్కడ శివాలయం నిర్మించి, శ్రీరామునిచే పూజలందుకున్న శివలింగం గనుక రామలింగేశ్వరాలయం అనే పేరుతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ గర్భాలయంలోని రెండు శివలింగాలు భక్తులతో పూజలందుకుంటున్నాయి. భక్తుల రాక పోకలు పెరగడంతో వైష్ణవుల కోసం రాధా, రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి ఆలయం నిర్మించారు. క్రమంగా శైవ మత సాంప్రదాయం ప్రకారం సంగమేశ్వర స్వామి ఆలయం, శివ పంచాయతన క్షేత్రాలైన పార్వతీ దేవి , గణపతి, కుమార స్వామి, వీరభద్ర స్వామి ఆలయాలు నిర్మించారు. అదే విధంగా కాశీ విశ్వనాథ స్వామి ఆలయం, వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు.

- Advertisement -
   

ముఖ్యంగా ఈ ఆలయాలన్నీ జీవనది ఒడ్డునే ఉండటంతో ప్రశాంత వాతావరణం, ఆద్యాత్మిక వాతావరణంతో చక్కని ప్రకృతి సోయగాలతో ఈ ప్రాంతం కొత్త కళను సంతరించుకుంది. జీవనదిలో తమ పితృదేవతలకు, పూర్వీకులకు పిండ ప్రదానాలు చేయడం, మాఘమ అమావాస్య రోజున ఉత్తరాయణ పుణ్యకాలం కావడంతో ఆ రోజున మంచి రోజుగా భావించి, పుణ్య స్నానాలు ఆచరించి, పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పుణ్య క్షేత్రం సమీపాన పెద్దవాగుతో పాటు, చిన్న వాగు కలిసి అక్కడి నుంచి ఒకే వాగుగా ప్రవహిస్తుంటాయి. రెండు వాగుల సంగమ క్షేత్రం గనుక, దక్షిణ కాశీగానూ భక్తులు పిలుస్తుంటారు. ముఖ్యంగా కూడవెల్లి రెండు వాగులు కలిసే చోటు నుంచి ఆలయ పరిసరాల్లోని కొంత దూరం వరకు వాగులోని పెద్ద పెద్ద బండరాళ్ళపై 108 శివలింగాలు చెక్కిన దృశ్యాలు కనిపిస్తాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయ మరమ్మత్తుల కోసం (జీర్ణోద్ధరణ), గాలిగోపుర నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడంతో నిర్మాణ పనుల్లో సింహభాగం పనులు పూర్తయ్యాయి. నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతర కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం దుబ్బాక, సిద్దిపేట, రామాయంపేట నుంచి ఆర్టీసీ బస్సులను కూడా నడిపిస్తుంటారు. మొదటి రోజున పుణ్య స్నానాల కారణంగా కొంత రద్దీ తక్కువగానే ఉండి, రెండో రోజు నుంచి నాలుగో రోజు వరకు జాతర రద్దీ పెరుగుతుంది. నాలుగు రోజుల పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని ఆలయ ఈవో పి. విశ్వనాథ శర్మ తెలిపారు. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు స్నానఘట్టాల ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేస్తున్నామన్నారు. స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు వాగులో లోతైన ప్రాంతానికి వెళ్ళవద్దని వారు సూచించారు. జాతర వద్ద భూంపల్లి పోలీసులు, దుబ్బాక సర్కిల్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement