Friday, March 31, 2023

15న స్విట్జర్లాండ్‌కు కేటీఆర్‌.. దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాలకు హాజరు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 16 నుంచి 20 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖల మంత్రి కేటీఆర్‌ హాజరు కానున్నారు. ఈ నెల 15న తెల్లవారుజామున కేటీఆర్‌ నాయకత్వంలోని బృందం హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. ఆయన వెంట ఐటీ, పరిశ్రమలు ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, డిజిటల్‌ మీడియా, జీవశాస్త్రాల విభాగాల సంచాలకులు కొణతం దిలీప్‌, శక్తినాగప్పన్‌లు ఉంటారు. సదస్సు అనంతరం 22న కేటీఆర్‌ రాష్ట్రానికి తిరిగి వస్తారు. గత ఎనిమిదేళ్లుగా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులకు కేటీఆర్‌ క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.

- Advertisement -
   

ఈసారి సదస్సులో తెలంగాణ ప్రగతిపై కీలకోపన్యాసం ఇవ్వడంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులతో ఆయన భేటీ కానున్నారు. వివిధ ప్యానెళ్ల చర్చాగోష్టుల్లో పాల్గొననున్నారు. భారత్‌లో అత్యంత వేగవంతంగా పురోగమిస్తున్న అంకుర రాష్ట్రంగా తెలంగాణను ప్రపంచ ఆర్థిక వేదిక సద్సులో పరిచయం చేస్తామని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. రాష్ట్ర ప్రగతిశీల పారిశ్రామిక విధానాలను వెల్లడించడంతో పాటు భారీగా పెట్టుబడుల సాధనకు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు స్విట్జర్లాండ్‌ బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు…

దావోస్‌ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్‌ రాజధాని జురిచ్‌కు ఈ నెల 15న చేరుకోనున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికేందుకు స్విట్జర్లాండ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. స్విట్జర్లాండ్‌లోని ప్రవాస భారతీయులతో కేటీఆర్‌ మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నట్లు స్విట్జర్లాండ్‌ బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement