Thursday, April 25, 2024

కరోనా వ్యాప్తికి మీరే కారణం అవుతారు – కేసీఆర్ కు బహిరంగ లేఖ

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ, ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని భయం గుప్పిట్లో బిక్కుబిక్క మంటున్న ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలు జరపడం అమానుషం. కరోనా కట్టడికి చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో మొండిగా ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం వైరస్ ఉదృతికి దోహద పడుతుంది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా విపరీతంగా పెరిగిన కేసులే దీనికి సాక్ష్యం. మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కోవిడ్ కేసులు బాగా పెరిగినాయన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికం, అనైతికం.

ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవి కావు. ఇంకొక ఐదు, ఆరు నెలలు వాయిదా వేసినా ప్రజాస్వామిక ప్రక్రియకు వచ్చే నష్టమేమీ లేదు. ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వారంలోనే 3-4 రెట్లు కోవిడ్ కేసులు ఎక్కువైనాయి. ఫిబ్రవరి నెల మొత్తం 4347 కేసులు, మార్చ్ నెలలో 8803 నమోదైనాయి. ఏప్రిల్ నెల నుండి తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరిగి పోయి… ఇప్పుడు ప్రతీరోజూ 6000 పైగా ప్రజలు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ స్థాయి కేసులకే పరీక్షలు జరపడానికి సౌకర్యాలు లేవు, కోవిడ్ సోకిన వారికి ఆసుపత్రి సౌకర్యం అందడం లేదు. మందులు అందుబాటులో లేవు. పరీక్షలకు, వైద్యానికి క్యూలలో ఎదురుచూడవలసి వస్తున్నది, ఉన్న ఆరోగ్య సిబ్బంది కూడా చాలడం లేదు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి, కరోనా వ్యాప్తిని కట్టడి చెయ్యడానికి వేగంగా చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో ఉన్నాం.

గ్రామాల్లోను, పట్టణాల్లోను, నగరాల్లోను ముందుగా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి కరోనాను ఎదుర్కోవడానికి సర్వ శక్తులు సన్నద్ధం చెయ్యవల్సిన ఈ సమయంలో ఎన్నికలు జరపడం బాధ్యతారాహిత్యం. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలను సాకుగా చూపించి, ప్రభుత్వం మున్సిపల్ఎన్ని కలను సమర్ధించుకోవాలని చూస్తున్నది. ఆ ఎన్నికలను డిసెంబర్ నెలలో ప్రకటించారు. అప్పటికి సెకండ్ వేవ్ రాలేదని గమనించాలి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఈ సందర్భంలో ఎన్నికలు అవాంచనీయం. బలవంతంగా ఎన్నికలు జరిపి మరిన్ని ప్రాణాలు బలి తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. జీవించే హక్కును కాపాడే లక్ష్యంతో ఈ ఎన్నికలను ఆపాలని కోరుతున్నామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, చుక్కా రామయ్య, ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశ్వరరావు, రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ రమా మేల్కోటే లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖను విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement