Monday, May 29, 2023

మోడీతో కోమటిరెడ్డి భేటీ.. వినతి పత్రాల్లో మోడీ నాయకత్వానికి ప్రశంస

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కాంగ్రెస్ ఎంపీ (భువనగిరి) కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ, ఆయన ప్రధానితో భేటీ అయ్యారు. గురువారం ఉదయం గం. 11.45 సమయంలో పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశమై తన నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి పలు వినతి పత్రాలను అందజేశారు. వాటిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ కొనియాడారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, విమానాశ్రయాలు, టెక్స్‌టైల్ పార్కులు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, మెట్రో రైల్ కనెక్టివిటీ సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి మోడీ సర్కారు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు విస్తరించాలని కోరారు.

మెట్రో విస్తరణపై ప్రతిపాదనలు పంపేలా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేందుకు ఉన్నతస్థాయిలో చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టును ఘట్‌కేసర్ నుంచి ఆలేరు, జనగాం వరకు పొడిగించాలని కోరుతూ ఒక వినతి పత్రాన్ని అందజేశారు. మరోవైపు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసల రహదారిగా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ అంశంపై ఇప్పటికే తాను పలుమార్లు పార్లమెంటులో ప్రస్తావించానని, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిని సైతం అనేకసార్లు కలిసి వినతి పత్రాలు అందజేశానని గుర్తుచేశారు. ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థ ఈ పాటికే విస్తరణ పనులు ప్రారంభించాలని, కానీ కోర్టులో కేసు వేసి జాప్యం చేస్తోందని ఆయన నిందించారు. ఈ అంశంపై ప్రధాని కార్యాలయం దృష్టి సారించి వీలైనంత త్వరగా నిర్మాణ పనులు మొదలుపెట్టేలా చొరవ చూపాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
   

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి కోసం నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని ప్రధాని మోడీకి కోరారు. నూతన టెక్నాలజీతో కూడిన ఆసు మిషన్లను కూడా భువనగిరి నియోజకవర్గంలోని చేనేత కార్మికుల కోసం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 18 ఏళ్ల నుండి 70 ఏళ్ల వయస్సు గల చేనేత కార్మిక కుటుంబాలను ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాల పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.

రాజకీయాల్లేవ్.. వాటి గురించి హైదారాబాద్‌లోనే మాట్లాడతా

ప్రధాన మంత్రిని కలిసిన వెంటనే తన నివాసానికి చేరుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తన భేటీ గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని హోదాలో అధికారులతో పాటు ఉన్న మోడీని తాను ఒక పార్లమెంటు సభ్యుడిగా కలిసినప్పుడు రాజకీయాల ప్రస్తావన ఎందుకు వస్తుందని ఎదురు ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల గురించి వివరించినపుడు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వడం లేదని ప్రధాని చెప్పారని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా, ఇవ్వకున్నా కేంద్రం మొత్తం ఖర్చు భరించి ప్రాజెక్టును అమలు చేయాలని కోరానని అన్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 వరుసలుగా విస్తరించడం గురించి ప్రస్తావించగా ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. తానిచ్చిన వినతి పత్రాల్లో కోరిన పనులపై ఒకట్రెండు నెలల్లో కొన్నింటిని ప్రారంభిస్తారని నమ్ముతున్నట్టు ఆయన చెప్పారు. రాజకీయాంశాల గురించి ప్రశ్నించగా, అవి హైదరాబాద్‌లోనే మాట్లాడతానని చెప్పారు. ఢిల్లీలో కేవలం అభివృద్ధి పనుల గురించి మాత్రమే మాట్లాడతానని, హైదరాబాద్ గాంధీభవన్ వేదికగా పార్టీ అంతర్గత వ్యవహారాలు సహా అన్ని రాజకీయాల గురించి మాట్లాడతానని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement