Saturday, April 20, 2024

బాహ్య ప్రపంచంలోకి కిమ్‌ కుమార్తె.. క్షిపణి ప్రయోగాన్ని వీక్షించేందుకు కూతురుతో వచ్చిన కిమ్‌

ఉత్తర కొరియా సుప్రీం లీడర్‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తొలిసారి కుమార్తెతో కలిసి బ#హరంగంగా కనిపించారు. తన ప్రైవేట్‌ లైఫ్‌ను గోప్యంగా ఉంచే కిమ్‌ వైఖరిలో ఇటీవల మార్పు వచ్చింది. ఏడు నెలల క్రితం భార్యతో కలిసి కనిపించిన ఆయన తాజాగా కుమార్తెతో కనిపించడం ఆసక్తిని కలిగించింది. కుమార్తెతో కలిసి చేతిలో చేయి వేసి నడుస్తున్న కిమ్‌ ఫొటోలను అధికారిక మీడియా కేసీఎన్‌ఏ ప్రచురించింది. అయితే, కిమ్‌ కుమార్తె పేరును మాత్రం వెల్లడించలేదు. శుక్రవారం ఓ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించేందుకు వస్తూ కిమ్‌ తన కుమార్తెను కూడా వెంటబెట్టుకొచ్చారు.

ఆ అమ్మాయి తెల్లటి కోటు ధరించి కనిపిస్తోంది. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆమె చేతులు పట్టుకొని ఉన్నాడు. ఆమె వయస్సు సుమారు 12-13 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా.. కిమ్‌కి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నట్లు సమాచారం. సెప్టెంబరులో జాతీయ సెలవుదిన వేడుకల ఫుటేజీలో వారిలో ఒకరు కనిపించారని, అది ఈ అమ్మాయేనని పలువురు విశ్లేషించారు. బాస్కెట్‌ బాల్‌ మాజీ స్టార్‌ డెనిస్‌ రోడ్మన్‌ 2013లో బ్రిటిష్‌ డైలీ ‘గార్డియన్‌’తో మాట్లాడుతూ.. కిమ్‌కు ఓ కుమార్తె ఉందని, ఆమె పేరు ‘జు ఏ’ అని పేర్కొన్నారు.

తాను ఆయన కుటుంబంతో గడిపానని చెప్పుకొచ్చారు. కిమ్‌ను మంచి తండ్రిగా అభివర్ణించిన ఆయన.. కిమ్‌ భార్య రి సోల్‌ జుతోనూ మాట్లాడానన్నారు. ప్యాంగాంగ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి ఓ ఇంటర్నేషనల్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ను ఉత్తర కొరియా ప్రయోగించింది. నార్త్‌ కొరియా ఈ నెలలో ప్రయోగించిన రెండో ప్రయోగం ఇది. ఈ క్షిపణి 999.2 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్‌ సముద్ర తీరంలో పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement