Tuesday, April 23, 2024

కిమ్‌ స్పై అంతరిక్ష ప్రయోగం విఫలం – నింగిలో పేలిపోయిన రాకెట్

ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జొంగ్ ఉన్.. గూఢచర్య ప్రయత్నాలు సముద్రంపాలయ్యాయి. రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా పేరు తెచ్చుకున్న ఉత్తర కొరియా చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ఘోరంగా విఫలమైంది. నింగిలోకి ప్రయోగించిన ఉపగ్రహం ఎల్లో సముద్రంలో కుప్పకూలింది.అగ్రరాజ్యం అమెరికా, దాయాది దేశం దక్షిణ కొరియా, పొరుగునే ఉన్న జపాన్‌ సహా.. ఇతర ఆసియా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా, ఆత్మరక్షణలోకి నెట్టేలా అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో గడగడలాడించిన కిమ్ జొంగ్- అంతరిక్షంపైనా ఆధిపత్యాన్ని చలాయించడానికి చేసిన ప్రయత్నం అది. అత్యాధునిక మిలటరీ గూఢచర్య ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు మంగళవారమే సెంట్రల్ మిలటరీ కమిషన్ ఉపాధ్యక్షుడు రి ప్యొంగ్ చోల్‌ ప్రకటించారు.

ఈ తెల్లవారు జామున దీన్ని ప్రయోగించారు. మల్లిగ్‌ యాంగ్-1 పేరుతో ఈ స్పై శాటిలైట్‌ రూపొందింది. చోల్లిమా-1 అనే రాకెట్- ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. తీర ప్రాంత నగరంలో నిర్మించిన రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి ఉత్తర కొరియా కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున 6:27 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది ఈ రాకెట్. కొద్దిసేపటికే విఫలమైంది. ఎల్లో సముద్రంలో కుప్పకూలింది.ఈ రాకెట్ ప్రయోగం విఫలమైన విషయాన్ని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. తొలిదశ విజయవంతమైనప్పటికీ- మలిదశలో అంటే రాకెట్ నుంచి శాటిలైట్ విడిపడే దశలో సాంకేతిక లోపాలు తలెత్తాయని వివరించింది. మలిదశలో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్ల ప్రయోగం విఫలమైందని పేర్కొంది. రాకెట్, ఉపగ్రహ శకలాలు ఎల్లో సముద్రంలో కూలిపోయినట్లు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement