Thursday, April 18, 2024

కిడ్నాప్‌ అబద్ధం, ఆప్‌ అభ్యర్థి యూ టర్న్.. హైడ్రామాకు ముగింపు

గుజరాత్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ అబ్యర్థి కంచన్‌ జరివాలా కిడ్నాప్‌ వ్యవహారం కీలకమలుపు తిరిగింది. తమ అభ్యర్థిని బీజేపీ నేతలు కిడ్నాప్ చేశార‌ని, పోటీ నుంచి తప్పుకునేలా ఒత్తిళ్లు తెస్తున్నారని ఆప్‌ అగ్రనేతలు ఆరోపించారు. ఢిల్లి సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం సిసోడియా ట్విట్టర్‌ వేదికగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంతలో అనూహ్య పరిణామం జ‌రిగింది. మంగళవారం మధ్యాహ్నం అదృశ్యమైన కంచన్‌, బుధవారం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. త‌న నామినేషన్‌ వెనక్కి తీసుకున్నారు. సూరత్‌ (తూర్పు) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కంచన్‌ కనిపించడం లేద‌ని ఢిల్లి సీఎం అరవింద్‌కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేసిన కొద్ది గంటల తర్వాత నామినేషన్‌ ఉపసంహరణ జరిగింది.

ఈ కిడ్నాప్‌ వ్యవహారం హైడ్రామా గురించి సదరు అభ్యర్థి కంచన్‌ జరివాలా మీడియాతో మాట్లాడుతూ సొంతపార్టీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు. నామినేషన్‌ ఉపసంహరణకు ఎవరి నుంచీ ఎలాంటి ఒత్తిళ్లు రాలేదు. నా అంతరాత్మ ప్రబోధానుసారం నామినేషన్‌ వెనక్కి తీసుకోవడం జరిగింది. ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు నన్ను నిలదీశారు. దేశ వ్యతిరేక, గుజరాత్‌ వ్యతిరేక భావజాల పార్టీ తరఫున ఎందుకు పోటీ చేస్తున్నావని ప్రశ్నించారు. దీనిపై నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకున్నాను. వారి వాదన నిజమే అనిపించింది. అందుకే పోటీ నుంచి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాను అని కంచన్‌ జరివాలా వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement