Monday, April 15, 2024

సంక్షోభంలో.. ఖమ్మం గ్రానైట్‌ పరిశ్రమ..! ముడిసరుకు లభించక మూసివేత దిశగా ఫ్యాక్టరీలు

ఖమ్మం, ఉమ్మడి బ్యూరో న్యూస్‌: తెలంగాణా రాష్ట్రంలో గ్రానైట్‌ పరిశ్రమకు కేరాఫ్‌గా, లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్న ఖమ్మం గ్రానైట్‌ పరిశ్రమ ముడి సరుకు లభించక, ప్రభుత్వం నుండి రావాల్సిన 40శాతం రాయితీలు రాక సంక్షోభం వైపు పయనిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఉన్న 500ల వరకు చిన్న తరహా గ్రానైట్‌ పరిశ్రమలు, 200లకు పైగా ఉన్న పెద్ద తరహా గ్రానైట్‌ పరిశ్రమలన్నీ ప్రస్తుతం మూతపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో సింగరేణి లాంటి పెద్ద సంస్థ కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వానికి మైనింగ్‌ రాయల్టిd ఫీజుల రూపంలో కోట్లాది రూపాయల ఆదాయాన్ని గ్రానైట్‌ పరిశ్రమలు, క్వారీలు సమకూర్చుతున్నప్పటికీ ప్రభుత్వం అంతగా పట్టించుకోకపోవడంతో ఖమ్మం జిల్లాలో ఇబ్బందికరంగా నడుస్తున్న , గ్రానైట్‌ పరిశ్రమలు, క్వారీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీఓలు 18 నుండి 26 వరకు గ్రానైట్‌ పరిశ్రమకు అవరోధంగా మారినట్లు యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. కరోనా కష్టకాలం నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న దశలో ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు లభించాల్సి ఉండగా, మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ప్రభుత్వ జీఓలు పరిశ్రమలను మూసివేత వైపుకు నెట్టివేస్తున్నాయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త జీఓల కారణంగా కొత్త రకాల పన్నులు వేశారని, ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నులకు అదనంగా 10 నుండి 15 రె ట్ల వరకు వసూలు చేయాలని జీఓలు చెబుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

క్వారీలకు హెక్టారుకు రూ.8లక్షల అదనపు భారం పడుతోందని, సెక్యూరిటీ డిపాజిట్లు పెంచి గ్రానైట్‌ , క్వారీల పరిశ్రమలను సంక్షోభంలోకి ప్రభుత్వం నెట్టివేస్తుండడం సరైంది కాదని వాపోతున్నారు. పర్మినెంట్‌ ఫీజు పెంచుతూ విడుదల చేసిన జీఓలు 18 నుండి 26 వరకు రద్దు చేయడంతో పాటు 6, 7 సంవత్సరాలుగా గ్రానైట్‌ పరిశ్రమలకు రావాల్సిన 40శాతం సబ్సిడీ రాయితీలను వెంటనే ప్రభుత్వం విడుదల చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను యాజనమాన్యాలు కోరుతున్నాయి. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్రప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ల దృష్టికి పలుమార్లు సమస్యలు వివరించి ప్రస్తావించడం జరిగిందని సంఘాలు పేర్కొంటున్నాయి. అయినప్పసటికీ తమ సమస్యకు పరిష్కారం లభించలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి సంక్షోభంలోకి వె ళ్తూ మూసివేతకు సిద్దమౌతున్న గ్రానైట్‌ పరిశ్రమను కాపాడాలని కోరుతున్నారు. కొత్త క్వారీలకు అనుమతులు ఇవ్వక పోవడంతో గ్రానైట్‌ ముడిసరుకు లభించని పరిస్థితులు నెలకొంటున్నాయని, ఇతర రాష్ట్రాల నుండి గ్రానైట్‌ ముడిసరుకు తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఎక్కువ శాతం ప్రస్తుతం నడుస్తున్న పెద్ద క్వారీల గ్రానైట్‌ అంతా ఎగుమతులకు ఇతర దేశాలకు వెళ్తోందని, స్థానికంగా ఉన్న 700ల వరకు గ్రానైట్‌ పరిశ్రమలకు ముడిసరుకు లభించక ఇబ్బందికరంగా ఉన్నందున ప్రభుత్వం సమస్యను సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని, గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకోవాలని, లక్షలాది మంది జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని గ్రానైట్‌, క్వారీ యాజమాన్యాలు కోరుతున్నాయి.

ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి : అసోసియేషన్‌
సంక్షోభంలోకి వెళ్తున్న ఖమ్మం గ్రానైట్‌, క్వారీల పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించి తగురీతిలో ఆదుకోవాలని, కొత్త క్వారీలకు అనుమతులు ఇచ్చి పెండింగ్‌ రాయితీలు విడుదల చేయాలని, లక్షలాది మంది ఉపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ఖమ్మం గ్రానైట్‌ స్లాబ్‌ ఫ్యాక్టరీ ఓనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు తమ్మినేని వెంకట్రావు, పారా నాగేశ్వరరావు, పాటిబండ్ల యుగంధర్‌, రాజేష్‌, జిల్లా అధ్యక్షులు ఉప్పల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి ఎన్‌.శ్రీనివాసరెడ్డి తదితరులు కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement