Monday, March 18, 2024

కేంద్రం దృష్టికి ఖమ్మం పత్తి వ్యాపారుల ఇబ్బందులు.. ఎంపీ నామ విజ్ఞప్తిపై జీఎస్టీ ఛైర్మన్ సానుకూలం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ సభ్యులు, బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు చొరవతో ఎట్టకేలకు ఖమ్మం పత్తి వ్యాపారుల సమస్యలకు పరిష్కారం లభించింది. సోమవారం ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షులు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు సోమా నరేష్ కుమార్, కోశాధికారి తల్లాడ రమేష్, ఎగుమతి  శాఖ అధ్యక్షులు నల్లమల ఆనంద్, కార్యదర్శి చెరుకూరి సంతోష్ కుమార్‌తో కూడిన ప్రతినిధుల బృందం నామ నాయకత్వంలో న్యూఢిల్లీలో జీఎస్టీ ఛైర్మన్ వివేక్ జోహావిని కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రం సమర్పించారు. 2017 నుంచి 2019 వరకు ఆర్సీఎం పద్దతిలో జీఎస్టీ చెల్లించామని, కొత్త విధానంలో 2019 నుంచి ముడి పత్తి అమ్మకాలు, కొనుగోళ్లపై జీఎస్టీ చెల్లిస్తున్నట్టు వ్యాపారులు చెప్పుకొచ్చారు. కానీ ఖమ్మంలోని జీఎస్టీ అధికారులు మొదటి నుంచి అమ్మకాలు, కొనుగోళ్లపై జీఎస్టీ లెక్క కట్టలేదని ఆరోపిస్తూ పాత బకాయిలు కూడా కట్టాలంటూ నోటీసులు ఇచ్చారని ఛైర్మన్‌కు వివరించారు.

- Advertisement -

పాత విధానంలోనే పత్తి వ్యాపారులు జీఎస్టీ కట్టినా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, వారిపై నమోదు చేసిన కేసులను వెంటనే  ఉప సంహరించుకోవాలని నామ నాగేశ్వరావు, వివేక్ జోహావిని కోరారు. పత్తి వ్యాపారులు కొనుగోళ్లు ఆపితే రైతులు ఎంతో ఇబ్బంది పడతారు కాబట్టి వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని అభ్యర్థించారు. 2019 నుంచి ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తూ వ్యాపారులు జీఎస్టీ చెల్లిస్తున్నారని నామ వివరించారు. ఆయన విజ్ఞప్తిపై జీఎస్టీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. జీఎస్టీకి  సంబంధించి ఖమ్మంలోని పత్తి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం ఖమ్మంలో పత్తి వ్యాపారులు నామ నాగేశ్వరరావును కలిసి తమ సమస్యలు వివరించగా, వెంటనే స్పందించిన ఆయన సోమవారం వారిని న్యూఢిల్లీ తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. తమ ఇబ్బందుల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్న ఎంపీ నామకు ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement