Thursday, April 25, 2024

ఖమ్మం భారాస ప్రీరిలీజ్ ఫంక్షన్ అట్టర్ ఫ్లాప్.. సభకు వచ్చిన నేతలంతా స్కాముల్లో ఉన్నవారే : బండి సంజయ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన భారాస సభ అట్టర్ ఫ్లాప్ అని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ప్రజలంతా ఇండియా-న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ చూశారే గానీ బీఆర్‌ఎస్ సభను ఎవ్వరూ పట్టించుకోలేదని విమర్శించారు. గురువారం బండి సంజయ్ తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సభకు వచ్చిన నేతలు యాదాద్రికి వెళ్తే భక్తులు ఐదు గంటలసేపు ఇబ్బంది పడ్డారన్నారు. గుడి మీద పెట్టుబడి పెడితే హుండీ ఆదాయం వస్తుందని చెప్పడానికే వారిని తీసుకెళ్లినట్టున్నారని విమర్శించారు. కేసీఆర్ మాట్లాడితే చైనా, పాకిస్తాన్ అంటున్నారు, ఆ రెండు దేశాల కంటే భారత్ చాలా బావుందని సంజయ్ చెప్పుకొచ్చారు. 5వేల టీఎంసీల రిజర్వాయర్ కడతానని ప్రకటిస్తున్న కేసీఆర్ ఎక్కడ కడతారో, కట్టే అవకాశం ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.

అసలు రాష్ట్రంలో నీటివనరులను సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. 2014లో 18 లక్షల బోర్ బావులుంటే ఇప్పుడు వాటి సంఖ్య 24 లక్షలకు పెరిగిందని తెలిపారు. రైతులకు నీళ్లు ఇస్తే బోర్ల సంఖ్య తగ్గాలే గానీ ఎందుకు పెరిగిందని సంజయ్ ప్రశ్నించారు. ఒక్క రైతుబంధు ఇచ్చి మిగతా సబ్సిడీలన్నీ వెనక్కి తీసుకున్నారని, విద్యుత్ పంపిణీ సంస్థలకు బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. అలాంటప్పుడు అది ఫ్రీ కరెంట్ ఎలా అవుతుందన్నారు. రాష్ట్రంలో బీజేుపీ అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలు తాము కడితే, ఇన్నాళ్లుగా ఇచ్చిన కరెంట్ తమ సర్కార్ ఉచితంగా ఇచ్చినట్టవుతుందని సంజయ్ జోస్యం చెప్పారు.

దళితుల అభ్యున్నతికి బీజేపీ కృషి..

- Advertisement -

కేసీఆర్ నెత్తిన టోపీ పెట్టుకుని జోకర్‌గా కనిపిస్తూ మేకిన్ ఇండియాను జోక్ అంటున్నారని మండిపడ్డారు. ఇటీవల సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన ‘వందే భారత్’ రైలు భారత్‌లోనే తయారైందని గుర్తు చేశారు. మహిళా బిల్లును పార్లమెంటులో చింపేసిన సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను పక్కన పెట్టుకుని మహిళలకు 35 శాతం రిజర్వేషన్ అని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ దృష్టిలో మహిళ అంటే ఆయన కూతురు కవిత మాత్రమేనని బండి సంజయ్ చెప్పారు. దళిత బంధు ఏమైంది? దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైందంటూ ఆయన నిలదీశారు. దళితులకు రూ. 10 కోట్ల రుణాలిస్తూ వారి అభ్యున్నతి కోసం బీజేపీ పని చేస్తోందని వివరించారు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం, చివరకు జై తెలంగాణ నినాదం కూడా ఖమ్మం మీటింగులో లేవని సంజయ్ విమర్శించారు. సభకు వచ్చిన నేతలెవ్వరూ బీఆర్ఎస్ మాటే ఎత్తలేదని ఎద్దేవా చేశారు. వచ్చిన వారంతా తలా ఒక స్కాములో ఉన్నవారేనని సంజయ్ తెలిపారు.

ఎవరైనా సరే తెలంగాణలో పెట్టుబడి పెట్టాలంటే కేసీఆర్ కుటుంబానికి కమిషన్లు ఇవ్వాలని, అందుకే తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు యూపీ తన్నుకుపోయిందని అన్నారు. కేసీఆర్ మతం గురించి మాట్లాడుతూ మతతత్వ మజ్లిస్‌తో కలిసి తిరుగుతారని సంజయ్ ధ్వజమెత్తారు. నిజాం వారసుడి మృతదేహం వద్ద ఆయన తరపు వారెవ్వరూ టోపీ పెట్టుకోకపోయినా కేసీఆర్ మాత్రమే పెట్టుకున్నారని విమర్శించారు. జిల్లాకో ఇంజనీరింగ్ కాలేజ్ పెడతానన్న ప్రకటనలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విలేకరులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానంటే వారు నవ్వుకుంటున్నారని సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. మోడీని తిట్టడం, బీజేపీని బద్నాం చేయడం తప్ప ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. మిషన్ భగీరథ పేరుతో రూ. 40 వేల కోట్లు నాశనం చేసి, దేశమంతటా పెట్టాలని చూస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement