Thursday, April 18, 2024

మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్, కేసీఆర్.. బీజేపీ నేత తరుణ్ చుగ్ సంచలన ఆరోపణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర రావు ఉన్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులిచ్చిన అంశంపై స్పందిస్తూ.. చట్టానికి అందరూ సమానమేనని, ఈ విషయం ఉన్నత పదవుల్లో ఉన్నవారు గ్రహించాలని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

శనివారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమన్నా, భారత చట్టాలన్నా గౌరవం లేదని అన్నారు. ఉన్నత కుటుంబంలో జన్మించినంత మాత్రాన ఎవరూ చట్టానికి అతీతులు కారని తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ అంటేనే కుటుంబవాదం, అవినీతి, దోపిడీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చాలదన్నట్టు తమ అవినీతి, దోపిడీని ఢిల్లీ వరకు విస్తరించారని విమర్శించారు. ఢిల్లీ మద్యం పాలసీ, పంజాబ్ మద్యం పాలసీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఈ రెండింటిలో కేజ్రీవాల్, కేసీఆర్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. అందుకే కేసీఆర్, కవిత పదే పదే ఢిల్లీ వచ్చి వెళ్తున్నారని సూత్రీకరించారు.

సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తును రాజకీయ కక్షసాధింపుగా టీఆర్ఎస్ నేతలు అభివర్ణించడంపై స్పందిస్తూ.. ఏ తప్పూ చేయకపోతే అన్ని మొబైల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ కేసులో అరెస్టయినవారు కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. సెల్‌ఫోన్లలో ఉన్న కీలక సాక్ష్యాధారాలు దర్యాప్తు సంస్థలకు దొరక్కుండా చేయడం కోసమే లక్షల రూపాయలు విలువ చేసే ఫోన్లను ధ్వంసం చేశారని ఆయనన్నారు. ప్రస్తుతం సాక్షి లేదా అనుమాతులుగా సీబీఐ విచారణ పిలిచినా, లోతుగా దర్యాప్తు చేస్తే నిందితులెవరో, సాక్షులెవరో తెలిసిపోతుందని చుగ్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

మొత్తంగా ఒక మాఫియా తరహాలో వ్యవహరించారని, వారిలో కవిత సౌత్ లిక్కర్ మాఫియాలో కీలక పాత్ర పోషించారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో కొడుకు వేరేగా, కూతురు వేరేగా, అల్లుడు వేరేగా ఎవరికి వారు అందినకాడికి దోచుకుంటున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. ఢిల్లీలో చూస్తే ఉపముఖ్యమంత్రి సంతకాలు చేస్తూ కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఊహించినదాని కంటే చాలా పెద్దదని, దీనిపై లోతైన దర్యాప్తు జరగాలని తరుణ్ చుగ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement