Thursday, April 25, 2024

నాగ్‌పూర్‌కి భారాస బాస్‌.. వచ్చే వారంలో వెళ్లే అవకాశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారాస జాతీయ పార్టీగా మారిన తర్వాత మహారాష్ట్రపై దృష్టి సారించింది. ఇప్పటికే మూడు సభలను విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు వడి వడిగా అడుగులు వేస్తున్నారు. నిత్యం చేరికలు సైతం కొనసాగుతున్నాయి. ఇప్పటికే శిక్షణ తరగతులను నిర్వహించారు. సభ్యత్వ నమోదును అన్ని నియోజకవర్గాల్లో ఏకకాలంలో నమోదును ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు 1.5 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయని అధినేత కేసీఆర్‌కు ఆ రాష్ట్ర నేతలు తెలిపారు. దీనిపై సీఎం కేసీఆర్‌ సైతం సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

తమ లక్ష్యంలో ఇది సుభ పరిణామంగా అభివర్ణిస్తూ వారిని అభినందించారని గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రేపటితో సభ్యత్వ నమోదుకు నెల రోజుల గడువు ముగియనుంది. రాజకీయ అస్థిరత మహారాష్ట్రలో కొనసాగుతున్న సమయంలోనే నిలదొక్కుకునే ప్రయత్నాన్ని గులాబీ పార్టీ ముమ్మరం చేసింది. ఇదే సరైన సమయంగా భావిస్తూ విస్తరించడమే కాకుండా పాగా వేయాలని ప్లాన్‌ చేస్తోంది. ఆ విధంగానే పార్టీ కార్యక్రమాలు, తెలంగాణ మోడల్‌పై విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్థానికులకు అర్థం అయ్యేలా వారి భాషల్లోనే జానపద పాటలతో ముందుకు వెళ్తున్నారు.

- Advertisement -

నాగ్‌పూర్‌లోనూ పాగ..

నాందేడ్‌లో పార్టీకి మంచి ఆదరణ లభించినట్లుగానే ఇతర ప్రాంతాల్లోనూ ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని భారాస భావిస్తోంది. ప్రధాన పట్టణాల్లో పార్టీ కార్యాలయాలు ఉంటే మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా ఆలోచిస్తోంది. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ఆఫీసులను ప్రారంభించుకోనున్నట్లుగా అధినేత గతంలో ప్రకటించారు. నాందేడ్‌లో ప్రారంభించడమే కాకుండా శిక్షణ తరగతులను నిర్వహించారు. ఇప్పుడు నాగ్‌పూర్‌లోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ కార్యాలయాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

వచ్చే వారంలో సీఎం కేసీఆర్‌ నాగ్‌పూర్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లుగా గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నాగ్‌పూర్‌ కేంద్రంగా దాని పరిసరాల్లో పార్టీ విస్తరించడమే కాకుండా బలాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. ఇప్పటికే నాగ్‌పూర్‌ నుంచి పలువురు నేతలు పార్టీలో చేరారు. వారంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే దిశగా క్షేత్రస్థాయిలో పని చేసుకోవాలని అధినేత సూచించినట్లుగా తెలుపుతున్నారు. నాందేడ్‌లో పార్టీ బలపడినట్లే నాగ్‌పూర్‌లోనూ బలపడేలా చూడాలని అక్కడి నేతలకు భవిష్యత్‌ కార్యాచరణపై అధినేత కేసీఆర్‌ వచ్చే వారంలో దిశానిర్ధేశం చేయనున్నారు.

త్వరలో ముంభై, పూణే..

మహారాష్ట్రలో ఉన్న పరిస్థితులును బట్టి ముంబై కేంద్రంగా పార్టీ కార్యాలయాలు కాకుండా నలు దిక్కులా అందరికి అందుబాటులో ఉండే విధంగా పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేందుకు అధినేత కేసీఆర్‌ నాలుగు ప్రాంతాల్లో పార్టీ ఆఫీసులను ప్రారంభించనున్నట్లుగా గతంలో ప్రకటించారు. మొదట నాందేడ్‌లో ప్రారంభించి అక్కడి స్థానిక నేతలకు సౌకర్యాన్ని కల్పించారు. నాగ్‌పూర్‌ కేంద్రంగా మరో కార్యాలయం అందుబాటులోకి వచ్చే వారంలో రానుంది. ఆ తర్వాత పూణే, ముంభైలోనూ ఆఫీసులను ప్రారంభించి అక్కడి వారికి పార్టీ కార్యక్రమాలను, విస్తరణ పనుల బాధ్యతలను అప్పగించనున్నారు.

నాందేడ్‌ కేంద్రంగా దాని పరిధిలో కొన్ని జిల్లాలు, నాగ్‌పూర్‌ కేంద్రంగా కొంత ప్రాంతం, పూణే కేంద్రంగా దాని పరిసరాలు, ముంబైని ఆనుకోని ఉన్న సరిహద్దు ప్రాంతాలుగా పని విభజనను చేయనున్నారు. మహారాష్ట్ర భౌగోళికంగా చాలా పెద్ద రాష్ట్రం. దాదాపు 288 అసెంబ్లి స్థానాలను కలిగి ఉంది. దీంతో అంతటా తక్కువ సమయంలో విస్తరించడం అనేది అంత సులువు కాదని భావించే అధినేత ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల లోపే పార్టీని అన్ని ప్రాంతాల్లో బలోపేతం చేసే దిశగా భారాస అధినేత ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement