Saturday, April 20, 2024

రెండు ఎమ్మెల్సీలు గెలవాల్సిందే… బాధ్య‌త మీదే….కెసిఆర్

హైదరాబాద్‌, : ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్నారు. రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో గెలవాల్సిందేనని పట్టుదలగా ఉన్నారు. ఇందుకు సంబంధించి వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ప్రగతిభవన్‌లో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై తీవ్రంగా చర్చించారు. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా సీరియస్‌ వర్క్‌లో ఉన్నారని, ఇదే వేడి కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పల్లా గెలుపు ఖాయమని, ఈ దఫా హైదరాబాద్‌ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని నిర్ణయించారు. మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీదేవిని అభ్యర్థిగా నిలిపినందున, ఆ మహానాయకుడి ఔన్నత్యం కాపాడేలా.. గెలిపించేందుకు పట్టుదలగా కృషి చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఇందుకోసం జిల్లాల వారీగా ఇన్‌ఛార్జిలను కూడా నియమించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులందరినీ సమన్వయం చేసుకుని.. తక్కువ సమయం ఉన్నందున అభ్యర్థి అందుబాటులో ఉన్నా.. లేకున్నా ఆ బాధ్యత అంతా తీసుకుని పనిచేయాలని సీఎం కేసీఆర్‌ నేతలకు సూచించారు. మార్చి 14న ఎమ్మెల్సీ పోలింగ్‌ జరగనుంది.
రంగారెడ్డి ఇన్‌ఛార్జిగా హరీష్‌
రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఇన్‌ఛార్జిగా వేముల ప్రశాంత్‌ రెడ్డి, హైదరాబాద్‌ ఇన్‌ఛార్జిగా గంగుల కమలాకర్‌లను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుక్రవారం నియమించారు. అటు నల్లగొండ, ఇటు హైదరాబాద్‌ రెండు స్థానాలను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పర్యవేక్షించనున్నారు. ఈ రెండు స్థానాల్లో గెలుపును సీఎం కేసీఆర్‌ సవాల్‌గా తీసుకోగా.. పార్టీ క్యాడర్‌, నేతలు ఎన్నడూలేని రీతిలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించారు. క్షేత్రస్థాయి వరకు ఉన్న టీఆర్‌ఎస్‌ నెట్‌వర్క్‌, ప్రభుత్వ పాజిటివ్‌ ఓటు.. అత్యధిక అభ్యర్థులు పోటీచేసే క్షేత్రంలో కలిసి వస్తుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపునకు సంబంధించిన కార్యాచరణపై సీఎం కేసీఆర్‌ మంత్రులకు, నేతలకు కీలక సూచనలు చేశారు. సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశానికి టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కే.కేశవరావుతో పాటు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్‌, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, శ్రీనివాసగౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement