Wednesday, December 6, 2023

Delhi | నాతో చెప్పండి – మీడియాతో కాదు.. బీసీ నేతలకు కేసీ వేణుగోపాల్ హితబోధ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల్లో బీసీ నేతలకు తగిన ప్రాతినిథ్యం, ప్రాధాన్యత ఉండాలని డిమాండ్ చేస్తున్న టీ-కాంగ్రెస్ బీసీ నేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ మందలించారు. పార్టీలో ఏ సమస్య ఉన్నా నేరుగా తనతో చెప్పాలని, మీడియా ముందుకు వెళ్లి పార్టీకి నష్టం కల్గించే చర్యలకు పాల్పడరాదని మందలించినట్టు తెలిసింది.

గత నాలుగైదు రోజులుగా అధిష్టానం పెద్దలను కలిసేందుకు ఎదురుచూస్తున్న టీ-కాంగ్రెస్ బీసీ నేతలు గురువారం రాత్రి ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం కొందరు నేతలు బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ రాష్ట్ర నాయకత్వంపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం మహారాష్ట్ర సదన్‌లో తెలంగాణ ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రేను కలిసిన బీసీ నేతలకు కేసీ వేణుగోపాల్‌తో అపాయింట్మెంట్ ఇప్పించారు.

- Advertisement -
   

మధ్యాహ్నం ఏఐసీసీ కార్యాలయంలో కేసీ వేణుగోపాల్‌ను కలిసినప్పుడు బీసీ నేతలకు ఆయన హితబోధ చేసినట్టు తెలిసింది. అదే సమయంలో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం టికెట్ల కేటాయింపులో సామాజిక సమతౌల్యం పాటించేలా చూడాలని తెలంగాణ సహ ఇంచార్జి రోహిత్ చౌదరికి ఆదేశించినట్టు తెలిసింది. బీసీ నేతలు చేస్తున్న డిమాండ్లపై అధిష్టానం సానుకూలంగానే ఉందని, కాకపోతే మీడియా ముందుకు వెళ్లి పార్టీకి నష్టం కల్గించేలా వ్యవహరించడాన్ని తప్పుబడుతోందని ఒకరిద్దరు నేతలు వెల్లడించారు.

రాష్ట్ర జనాభాలో 56% వరకు ఉన్న బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కనీసం పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ)లో చేసిన తీర్మానం ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండింటినైనా బీసీలకు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఆ లెక్కన మొత్తం 119 నియోజకవర్గాల్లో 34 సీట్లు బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది.

అయితే అభ్యర్థుల ఎంపిక కసరత్తులో సర్వే నివేదికల పేరు చెప్పి సామాజిక సమీకరణాలను పూర్తిగా పక్కనపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు టికెట్లు ఇస్తే ఓడిపోతున్నారంటూ అధిష్టానాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన కాంగ్రెస్ నేతల్లో బీసీల కంటే అగ్రవర్ణాల నేతల సంఖ్యే ఎక్కువగా ఉందని ఉదహరించారు.

డబ్బు లేదని, ఖర్చు పెట్టలేరని, టికెట్ ఇస్తే ఓడిపోతారని, సర్వే నివేదికలు అనుకూలంగా లేవని చెప్పడం కేవలం సాకు మాత్రమేనని, ఓటర్లలో అత్యధిక సంఖ్య బీసీలదేనని మర్చిపోవద్దని వారు చెబుతున్నారు. బీసీలకు ప్రాధాన్యత ఉందంటేనే బీసీల ఓట్లు పడతాయని వారు సూత్రీకరిస్తున్నారు. అధిష్టానం పెద్దలను కలిసి టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలన్నదే తమ ప్రయత్నమని నేతలు చెబుతున్నారు

నేడు ఖర్గేతో భేటీ?

అధిష్టానం పెద్దలను కలవడం కోసం ఢిల్లీ చేరుకున్న టీ-కాంగ్రెస్ బీసీ నేతల బృందం అపాయింట్మెంట్ కోసమే రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీ. హనుమంత రావు (వీహెచ్) సహా మరికొందరు నేతలు నాలుగైదు రోజుల క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గురువారం సాయంత్రం వరకు మధు యాష్కి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, మహేశ్ కుమార్ గౌడ్, సురేశ్ షెట్కార్, కత్తి వెంకటస్వామి, ఈర్ల కొమురయ్య తదితరులు చేరుకున్నారు.

టికెట్లు ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న ఆశావహులు, వారి అనుచరులతో కలిపి సుమారు 40-45 మంది ఓబీసీ నేతలు ఢిల్లీలో మకాం వేశారు. వేరే రాష్ట్రాల పర్యటనలో ఉన్న మల్లికార్జున ఖర్గే గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నారు. కానీ బీసీ నేతలకు మాత్రం అపాయింట్మెంట్ లభించలేదు. అదే సమయంలో మైనంపల్లి హనుమంత రావు, వేముల వీరేశం, అనిల్ కుమార్ రెడ్డి చేరిక కోసం సమయం కేటాయించారు.

శుక్రవారం ఉదయం వరకు ఖర్గే అపాయింట్మెంట్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రేను బీసీ నేతలంగా వెళ్లి కలిశారు. ఆయన కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయన ద్వారా ఖర్గేను, రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుదీర్ఘకాలం జాతీయస్థాయి రాజకీయాల్లో ఉన్న వీహెచ్, మధు యాష్కి వంటి నేతలు సైతం నేరుగా అధిష్టానం పెద్దలతో మాట్లాడి అపాయింట్మెంట్ ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోయింది. దాంతో బీసీ నేతలంతా ఢిల్లీలోనే పడిగాపులు గాస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement