Saturday, June 10, 2023

Delhi | కవిత సాక్షి, సోనియా ముద్దాయి.. ఒకరితో ఒకరిని పోల్చడం సరికాదు: ఎంపీ ధర్మపురి అరవింద్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సీబీఐ, ఈడీ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో లేవని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ కవిత నోటీసులు వస్తే విచారణకు సహకరిస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు ఇచ్చిన నోటీసులు సాక్షిగా, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని నిందితురాలిగా పిలిచారని స్పష్టం చేశారు. సాక్షి దగ్గరకు విచారణ అధికారులు వెళ్తారన్న అరవింద్, నిందితులను తమ దగ్గరకు పిలిపించుకుంటారని తేల్చి చెప్పారు.

- Advertisement -
   

తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై తనతో పాటు తమ పార్టీ నేతలు వివేక్, ప్రకాష్ రెడ్డి, అజ్మీరా బాబీ తదితరులతో బీజేపీ కమిటీ వేసిందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నామి, ఆ పార్టీపై ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ఈ నివేదిక కీలకమని తెలిపారు. ప్రజాధనం, ప్రజలను దోచుకోవడం తప్ప ప్రభుత్వానికి దేనిపైనా చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. విద్యుత్ రంగ వైఫల్యాలపై తాము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే కవితకు తనపై కోపం వచ్చిందని, తన ఇంటిపై దాడి వరకు వెళ్లారని చెప్పుకొచ్చారు. వ్యవసాయ రంగం, ఎన్నారైల అంశంపై రిపోర్టు ఇస్తున్నామని వెల్లడించారు.

రైతులను కూలీలుగా మార్చిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖర రావుదేనని, రుణమాఫీ చేస్తామని 2014, 2018 టీఆర్ఎస్ మేనిఫెస్టోల్లో పొందుపరిచారని అరవింద్ అన్నారు. రూ. 21 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించి రూ. 1,171 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు విడుదల చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తారనుకుని రైతులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర రుణాలు చేశారని ఆయన తెలిపారు. కామారెడ్డిలో ఓ రైతు టవరెక్కి ఇద్దరు పిల్లల ముందు ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కదిలించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తప్పుడు వాగ్దానాల కారణంగా రైతులు బలవుతున్నారని అన్నారు.

గ్రామాల్లో 6 నుంచి 10 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారన్న అరవింద్, అప్పులు చేస్తూ విద్యుత్ కొంటున్నారని, ఆ కొనుగోళ్లలో కుంభకోణాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఆ కుంభకోణం డబ్బులే లిక్కర్ స్కాంలలో, ఫీనిక్స్‌లలో పెట్టుబడులు పెడుతున్నారని వెల్లడించారు.ప్రస్తుతం అందరి దృష్టి కవిత మీదే ఉన్నా, యువరాజు(కేటీఆర్) ఎక్కువ టెన్షన్‌లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. 9 గంటల కంటే ఎక్కువ విద్యుత్ వ్యవసాయానికి అవసరం లేదని రైతులే చెబుతున్నారని అరవింద్ చెప్పారు. ఉచిత విద్యుత్ కారణంగా భూగర్భ జలాలు తగ్గుతున్నాయని రైతులే తీర్మానాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పొలంలో ఎకరానికి రూ. కోటి ఆదాయమని ప్రచారం జరుగుతోందన్న ఆయన, ఆ సీక్రెట్ ఏంటో రైతులకు చెప్పొచ్చు కదా అని అడిగారు.

వ్యవసాయ లబ్దిదారుల జాబితా సీఎం కేసీఆర్ బయటపెట్టడం లేదని, బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో సాయిల్ టెస్టింగ్ జరుగుతోందని చెప్పుకొచ్చారు. తద్వారా ఆ భూమికి తగిన పంటను సాగు చేసి ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని తెలిపారు. తెలంగాణను సీడ్ బౌల్ చేస్తామని చెప్పిన కేసీఆర్, విత్తనాల పరిశోధన మీద పెట్టిన ఖర్చు సున్నా అంటూ విమర్శించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచినా, తెలంగాణ ఏ స్థానంలో ఉందో కూడా తెలియదని ఆరోపించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కోసం 2020 వరకు నయా పైసా ఇవ్వలేదని, ఆ తర్వాత మూడేళ్ల పాటు రూ. 1,600 కోట్లు కేటాయించినా ఒక్క పైసా ఖర్చు చేయలేదని అరవింద్ మండిపడ్డారు.

రైతుల పేరు చెప్పి కేటాయించడం, ఆ నిధులను వేరే చోట ఖర్చు చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కట్టకపోవడం వల్ల బీమా ఫలాలు రైతులకు అందడం లేదని వాపోయారు. రైతు ఆత్మహత్యలకు ఇదీ కూడా ఓ కారణమేనని భాష్యం చెప్పారు. తెలంగాణ ఫారిన్ మినిస్టర్ అని గూగుల్ చేస్తే కేటీఆర్ ఫొటో వస్తోందని అరవింద్ ఎద్దేవా చేశారు. నేతలు, అధికారుల కేరళ టూర్ అధ్యయనం కోసం కాదని, వాళ్లు సంపాదించుకున్న డబ్బులు ఎక్కడ దాచాలో తెలుసుకోవడం కోసమని ఆయన ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement