Friday, April 26, 2024

ఉద్యోగ భద్రతే ముఖ్యం.. లేఆఫ్‌లతో మారుతున్న టెక్కీల వైఖరి

ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ టెక్‌ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను తీసువేస్తున్నాయి. టెక్‌ కంపెనీలో జాబ్‌ అంటేనే భయపడే పరిస్థితిని ఈ కంపెనీలు సృష్టిస్తున్నాయి. లాభాల కోసం భారీగా ఉద్యోగులను తీసుకున్న కంపెనీలు, రానున్న ఆర్ధిక మాంద్యం పేరుతో భారీగా ఉద్యోగులను తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. అత్యధిక లాభాలు చూపెట్టిన గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి ఎంతో ప్రతిష్టాత్మక సంస్థలు కూడా కేవలం నష్టాలు రావచ్చన్న అంచనాలతో ఇలా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతో టెక్నాలజీ ఉద్యోగుల ఉద్యోగ భద్రతపై మరోసారి చర్చ జరుగుతున్నది.

ఈ నేపథ్యంలోనే టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల బదులు స్థిరమైన, ఉద్యోగ భద్రత ఉండే ఉద్యోగాలే మేలని వీరు భావిస్తున్నారని ఒక నివేదిక వెల్లడిస్తోంది. అమేజాన్‌, గూగుల్‌, మిటా, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. దీంతో లేఆఫ్‌కు గురికాని ఉద్యోగులు సైతం రిక్రూట్‌మెంట్‌ సంస్థలు, వెబ్‌ సైట్స్‌కు పెద్ద సంఖ్యలో తమ రెజ్యూమ్‌లను పంపిస్తున్నారు. తాము చేస్తున్న టెక్‌ జాబ్‌ కంటే భద్రతమైన ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. టెక్‌ ఇండస్ట్రీలోని ఉద్యోగులు భారీ వేతన పెంపు కంటే స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. వంద శాతం వేతనం పెంచే రోజులు పోయాయని సెల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అదిత్య మిశ్రా అభిప్రాయపడ్డారు.

- Advertisement -

2021,2022 సంవత్సరాల్లో ఉద్యోగాలను భర్తీ చేసే విషయంలో కంపెనీలు అతిగా వెళ్లాయని ఆయన చెప్పారు. ఐదు సంవత్సరాల అనుభవం ఉండి, సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజీ ఉన్న వారికిఈ రెండు సంవత్సరాల్లో 50 లక్షల వరకు ఈ కంపెనీలు ఆఫర్‌ ఇచ్చాయని తెలిపారు. మరో వైపు 2022లో మన దేశంలోని టెక్‌ కంపెనీలు 75 వేల మందకిపైగా ఉద్యోగులను తొలగించాయి. ఇది ఉద్యోగులను అత్యాధునిక సాంకేతికతో అప్‌డేట్‌ అయ్యేందకు, నైపుణ్యాన్ని పెంచుకునేందుకు వారిని ప్రేరేపించింది. ఈ నేవేదిక ప్రకారం సంబంధిత నైపుణ్యాల్లో ఎక్కువగా డేటా అనలిటిక్స్‌, డేటా ఇంజనీరింగ్‌, అర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, వెబ్‌ 3.0, మెటావర్స్‌, 5జీ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. ఇలాంటి నైపుణ్యాలు కలిగి ఉన్న వారికి ఉద్యోగాల్లో ఇబ్బందులు కలగడంలేదు.

ఈ దిశగా ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు, ఈ కోర్సులను అదనంగా నేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు, రిక్రూట్‌మెంట్‌ కూడా భారీగా తగ్గించాయి. మన దేశంలో ప్రధానమైన టెక్‌ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌), విప్రో, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ కంపెనీలు డిసెంబర్‌ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో కవలం 1,940 మందిని మాత్రమే తీసుకున్నాయి. ఈ నాలుగు పెద్ద కంపెనీలు 2022 ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 61,137 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. కొవిడ్‌ తరువాత డిజిటలైజేషన్‌ కోసం పెరిగిన డిమాండ్‌తో ఈ నాలుగు కంపెనీలు పోటీ పడి మరీ ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకున్నాయి. 2022-23 ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ను 97 శాతం తగ్గించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement