Tuesday, April 23, 2024

తెలుగువాడి తెలివితేట‌ల‌కు జై : సీజేఐ ఎన్వీ రమణ

తెలుగువాడి తెలివితేటలకు జైజై, తెలుగువాడు దేనికైనా సైసై అని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. భాష లేకపోతే చరిత్ర లేదని, సంస్కృతి లేదన్నారు. కాలిఫోర్నియాలో ఇండో, అమెరికన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాతృ భాషను మొదటి భాషగా పిల్లలకు చెప్పించాలని సూచించారు. ప్రజల్లో మార్పు కోసం వ్యవస్థలు కలిసి సాగాలని చెప్పారు. మనం ఎంత సంపన్నులమైనా శాంతి అనేది అవసరమని, సమాజంలో ప్రశాంతత లేకుంటే హాయిగా జీవించలేమన్నారు.

ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానిది కీలక పాత్ర అని, సాకేంతిక ప్రపంచంలో అధునాతన ఆవిష్కరణలు అవసరమని సీజేఐ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. మౌలిక సదుపాయాల వృద్ధి వేగంగా పెరిగిందని తెలిపారు. నూతన ఆవిష్కరణల్లో భారత్‌ ముందుందని వెల్లడించారు. ఆవిష్కరణల్లో ప్రపంచంతో భారత్‌ పోటీపడుతున్నదని చెప్పారు. ఆలోచనల్లో మార్పు రాకపోతే ముందడుగు వేయలేమన్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు వస్తేనే మార్పు సాధ్యమవుతుందని చెప్పారు. తెలుగువారు ఎక్కడున్నా భాషే వారిని ఏకం చేస్తుందని సీజేఐ అన్నారు. విశ్వమానవ సౌభ్రాతృత్వానికి తెలుగువారు ప్రతీకలు కావాలని చెప్పారు. భారత్‌లో సరైన నాయకులను తయారుచేసుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు. నిస్వార్ధం, సేవాగుణం కలిగిన నాయకులు తయారుకావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement