Tuesday, April 23, 2024

పెద్ద స్టేడియంలో ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు వేళాయే.. 9న ఆస్ట్రేలియా, భారత్‌ నాలుగోటెస్ట్‌ మ్యాచ్‌

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. ఇరు జట్ల మధ్య మార్చి 9 న చివరిదైన నాలుగో టెస్ట్‌ సిరీస్‌ మ్యాచ్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌ హాజరుకానున్నారు. దీంతో పాటు భారత క్రీడాభిమానులు ఊరిస్తున్న వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాలు ఈ మ్యాచ్‌తో ముడిపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌ ప్రపంచంలోనే పెద్దదైన గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.ఈ స్టేడియం ప్రేక్షకుల కెపాసిటీ 1,32,000 మంది.

అయితే ఇప్పటివరకు అత్యధిక ప్రేక్షకులు హాజరైన స్టేడియంగా ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ చరిత్రకెక్కింది. 1,00,024 మంది ప్రేక్షకుల హాజరుతో రికార్డు సృష్టించింది మెల్‌ బోర్న్‌ క్రికెట్‌ స్టేడియం. అయితే ఈ రికార్డును ఇప్పటివరకు ఏ స్టేడియం బ్రేక్‌ చేయలేదు. ప్రస్తుతం నరేంద్ర మోడీ స్టేడియాన్ని ఊరిస్తోంది. స్టేడియంలో కనీసం 95 శాతం నిండినా.. ఈ రికార్డు బద్దలు కానుంది. అంతకుముందు ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘోరపరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. దీంతో చివరి మ్యాచ్‌లో పిచ్‌తో పాటు రెండు జట్ల ప్లేయింగ్‌ ఎలెవన్‌లో మార్పులు చూడవచ్చు.

- Advertisement -

పిచ్‌తో భారత్‌ గెలవొచ్చు: గవాస్కర్‌

నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్‌ కూడా భారత దేశంలోని మిగిలిన మైదానాల మాదిరిగానే స్పిన్‌ బౌలింగ్‌కు మద్దత్తు ఇస్తుంది. కానీ మీడియాల కథనాల ప్రకారం అహ్మదాబాద్‌లో జరగనున్న నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌కు స్పిన్‌ పిచ్‌ ఉండదని భావించారు. కానీ మరలా పిచ్‌లో మార్పులు చేసినట్లు , స్పిన్‌ బౌలర్లకు సహాయం అందుతుందని అంటున్నారు. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ స్పిన్‌ బౌలర్లకు సహాయం అందుతుందట.

ప్రతిష్టాత్మక బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ నేపథ్యంలో పిచ్‌లపై విపరీతంగా చర్చ జరుగుతోంది. మూడో టెస్టు జరిగిన ఇండోర్‌ పిచ్‌కు ఐసీసీ పేలవం రేటింగ్‌తో మూడు డీ మెరిట్‌ పాయింట్లు ఇచ్చింది. దీనిపై మాజీ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ మండి పడిన విషయం తెలిసిందే. దాంతో అహ్మదాబాద్‌ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌ పిచ్‌ ఎలా ఉంటుందనే విషయంపై అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో గవాస్కర్‌ పిచ్‌లపై మరో సారి స్పందించాడు. సమతుల్య పిచ్‌లు ఉండాల్సిన అవసరముందని సూచించాడు.

” ఇలాంటి నాణ్యతతో పిచ్‌లు ఉండటం గొప్ప ఆలోచన అని నేను అనుకోను. బ్యాట్‌, బంతికి మధ్య సమతుల్యత ఉండే పిచ్‌లు ఉండాలి. మొదటి రెండ్రోజులు కొత్త బంతి బౌలర్లకు కొంత సహకరించేలా.. బ్యాటర్లు పరుగులు చేయగలిగేలా పిచ్‌ ఉండాలి. ఆ తర్వాత 3,4 రోజుల్లో బంతి కాస్తా తిరగాలి” అని పిచ్‌ల గురించి సన్నీ వివరించాడు. ఇక అహ్మదాబాద్‌లో ఏం జరుగుతుందో తనకు తెలియదన్నాడు. ”అహ్మదాబాద్‌ పిచ్‌ టర్న్‌ అయితే మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించే అవకాశాలున్నాయి” అని మాజీ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డారు.

అంచనా..

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 14 టెస్టులు జరగ్గా అందులో ఆతిథ్య జ ట్టు 6 మ్యాచ్‌లు, విజిటింగ్‌ జట్టు 2 మ్యాచ్‌లు గెలిచాయి. ఇది కాకుండా 6 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఇక్కడ టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఇక్కడ భారత జట్టు విజయం ఖాయమని గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement