Friday, March 29, 2024

ఐటీఐఆర్ రద్దు రాజకీయ కక్ష సాధింపే.. కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ప్రకటించాలి : టీఆర్‌ఎస్ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఐటీ రంగంలో తెలంగాణ ఎంతో అభివృద్ధిని సాధించడానికి అవకాశమున్న ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు మండిపడ్డారు. సోమవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీలు రంజిత్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… ఐటీఐఆర్ రద్దు చేయడం నిజంగా సిగ్గుచేటన్నారు. 2008లో ప్రకటించి రూ. 160 కోట్లు మంజూరు చేసిన ప్రాజెక్టును అర్థాంతరంగా రద్దు చేయడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరిగితే అన్ని రంగాలు వృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీఆర్ వంటివేవీ లేకపోయినా తెలంగాణలో ఐటీ ఎంతో వృద్ధి చెందిందని అన్నారు. వరల్డ్ క్లాస్‌గా టీ-హబ్ ఏర్పాటు చేసుకున్నామని రంజిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఐటీఆర్ ఏర్పాటైతే ఐటీలో బెంగళూరును దాటిపోతుందని భయపడుతున్నారేమోననే విషయం అర్థం కావట్లేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు అమెరికా తర్వాత అతి పెద్ద ఆఫీసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని, దీనికి ధీటుగా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ప్రకటించాలని రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. 22 సాఫ్ట్‌వేర్ పార్కులు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే, ఒక్కటి కూడా హైదరాబాద్‌కి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు ఎఫ్‌ఆర్బీఎం పరిధిలోనే ఉన్నా రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అనేక రాష్ట్రాలు జీఎస్డీపీ కంటే ఎక్కువ అప్పులు చేశాయన్న రంజిత్ రెడ్డి, బడ్జెట్ మించి అప్పుల విషయంలోనూ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రమే 89శాతం మేర అప్పు చేసిందని, నిజానికి 40 శాతం వరకే ఉండాలని స్పష్టం చేశారు. ఎఫ్‌సీఐకి రూ. 2 లక్షల కోట్ల మేర అప్పు ఉందని రంజిత్ రెడ్డి వెల్లడించారు. 40 కోట్ల పైచిలుకు ధాన్యం బస్తాలు ఉండాల్సిన చోట 2 లక్షల బస్తాలు తక్కువ ఉన్నాయంటున్నారని విమర్శించారు. లెక్కల్లో తేడా ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వ సమస్య. మీకేం సంబంధమని ఆయన ప్రశ్నించారు. కాగ్ నివేదిక ప్రకారం కేంద్రం అనేక ఖర్చులకు లెక్కలు చూపడం లేదు, రెవెన్యూ డెఫిషిట్‌లో వీటిని చూపడం లేదని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు బీజేపీని నిలదీయాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని రంజిత్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై విలేకరులు ప్రశ్నించగా… సీఎం ఏదైనా చెప్పి చేయరని, సస్పెన్ ఉంటుందని ఆయన అన్నారు.

నిలబడతాం-నిలదీస్తాం : బడుగుల లింగయ్య యాదవ్
అనంతరం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణపై ప్రధాని మోడీ కక్షకట్టారని చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే 7 మండలాలు ఏపీలో కలిపారని గుర్తు చేశారు. ఎఫ్‌ఎసీఐ ద్వారా కొనాల్సిన ధాన్యం కొనే విషయంలో జాప్యం చేసి రైతులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి మోకాలు అడ్డం పెడుతూ ఇబ్బందులు సృష్టించారని వాపోయారు. దేశంలో ధరలు పెరుగుతూ, రూపాయి విలువ పడిపోతున్నా సరిదిద్దడం చేతకాక తెలంగాణపై పడి ఏడుస్తున్నారని లింగయ్య యాదవ్ మండిపడ్డారు. పార్లమెంట్‌లో తమను సస్పెండ్ చేసినా ఎదురొడ్డి నిలబడతామని, నిలదీస్తామని హెచ్చరించారు. టీఆరెస్ జాతీయ స్థాయిలో వస్తుందని భయపడి హైదరాబాద్‌లో బీజేపీ సభ పెట్టుకున్నారని ఎంపీ లింగయ్య ఎద్దేవా చేశారు.

లోక్‌సభలో చర్చ మా విజయమే : వద్దిరాజు రవిచంద్ర
పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వెంటనే ధరల పెరుగుదల మీద చర్చకు పట్టుబట్టామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వివరించారు. విపక్ష ఎంపీలతో కలిసి టీఆర్‌ఎస్ ఎంపీలను సస్పెండ్ చేయడంతో నిరసనగా 50 గంటలు దీక్ష చేశామని వెల్లడించారు. తమ డిమాండ్లపై లోక్‌సభలో చర్చ మొదలైందని, ఇది తమ విజయంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. భద్రాచలం వరదల నేపథ్యంలో వెయ్యి కోట్లు మంజూరు చేసి కరకట్ట మరమ్మతులకు ఆదేశించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరింది రూ 1,400 కోట్లే అయినా ఇవ్వడానికి కేంద్రానికి మనసు రావడం లేదని రవిచంద్ర ధ్వజమెత్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement