Wednesday, April 24, 2024

బాలవికాస్‌ కార్యాలయాల్లో ఐటీ దాడులు.. 20 బృందాలతో 40చోట్ల దాడులు

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : సేవాకార్యక్రమాలకు విదేశాల నుంచి వస్తున్న వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై వరంగల్‌ కేంద్రంగా పని చేస్తున్న బాలవికాస్‌ సోషల్‌ సర్వీస్‌ సొసైటీ ఇళ్లు, కార్యాలయాలు, క్యాంపస్‌లలో ఇన్‌కంటాక్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. బాల వికాస్‌ సొసైటీకి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా శౌరెడ్డి సింగారెడ్డి , ఆయన భార్య సునీతా రెడ్డి నిర్వహిస్తున్నారు. 30 సంవత్సరాల క్రితం ఈ సంస్థను స్థాపించారు. కొన్నాళ్ల పాటు మంచిపేరు గడించింది. అయితే. క్రమంగా విదేశాల నుంచి ఫారిన్‌ కంట్రిబ్యుషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఎ) కింద వస్తున్న నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. సంస్థకు విదేశాల నుంచి వచ్చిన రూ. 400 కోట్లకు పైగా నిబంధల మేరకు వినియోగించడంలేదని, నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తున్నారని, ఆస్తులు కూడగట్టుకోవడమే లక్ష్యంగా పని చేస్తోందని వచ్చిన ఆరోపణలపై ఆదాయపు పన్ను ఆరునెలలుగా నిఘా ఉంచి ఎట్టకేలకు దాడులకు దిగింది. బుధవారం ఏకకాలంలో సంస్థకు చెందిన 40 చోట్ల సోదాలు నిర్వహించింది.

- Advertisement -

ఈ దాడుల్లో ఆదాయపు పన్ను శాఖకు చెందిన 20 బృందాలు పాల్గొన్నాయి. సికింద్రాబాద్‌ , అల్వాల్‌, పటాన్‌చెరువు, కీసర, ఘట్‌ కేసర్‌, మల్కాజిగిరి, జీడిమెట్ల, బొల్లారం, మెదక్‌, వరంగల్‌ సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. పన్ను ఎగవేత, ఆదాయపు పన్ను చెల్లింపు తదితర డాక్యుమెంట్లను అధికారులు నిశితంగా తనిఖీ చేస్తున్నారు. ఆదాయానికి మించి ఉన్న ఆస్తుల కోణంలో కూడా సోదాలు నిర్వహించారు. అల్వాల్‌లో కి చెందిన సాజి కె జాన్‌ అనే వ్యక్తి బాలవికాస్‌ సంస్థలో కీలకమైన వ్యక్తిగా గుర్తించిన అధికారులు ఆయన నివాసంలో కూడా సోదాలు చేశారు. అవసరమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ జిల్లా కాజిపేట మండలం ఫాతిమానగర్‌లోని బాలవికాస్‌ పీపుల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో దాడులు నిర్వహించి సిబ్బంది మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

శౌరెడ్డి, ఆయన భార్య, కొందరు ఉద్యోగులపైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. సోదాలలో ఏమేమి దొరికాయి ? నగదు పట్టుబడిందా ? అనే విషయంపై ఇంకా సమాచారం బయటకు పొక్కలేదు. కాగా, ఐటి దాడులకు తెలంగాణ వ్యాపారులు ముఖ్యంగా నగరానికి చెందిన పారిశ్రామిక వేత్తలు, స్వచ్చంద సంస్థ లకు చెందిన వారు బెంబేలెత్తుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారిపై కూడా సోదాలు జరగడం సంచలనం సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితమే మంత్రి మల్లారెడ్డి ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. అదేవిధంగా మరో మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీ గాయత్రి రవి, వసుధాఫార్మా, వండర్‌ సిటీ, రాయల్‌ సిటీతో పాటుపలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్‌లో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement