Tuesday, March 19, 2024

Interview | జగన్‌ పాలనకు చరమగీతం తప్పదు.. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

ఇది పల్నాడు.. పౌరుషానికి పెట్టింది పేరు.. ఇక్కడ ఆత్మాభిమానం ఎక్కువ. తిండిలేకపోయినా పస్తులుంటారు గాని ఎదుటివాడు అవమానిస్తే భరించలేరని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఇక్కడ కాసు మహేష్‌రెడ్డి గెలిచిన తరువాత ఇక్కడ అరాచక పాలన సాగుతోందన్నారు. ఎమ్మెల్యే చేసిన అక్రమ మైనింగ్‌లో 8 మంది పిల్లలు చనిపోయారని ఆవేదన చెందారు. ఇటువంటి ఘటనలు పల్నాడు చరిత్రలో లేవన్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో రాజకీయాల్లో అరాచకాలను ప్రజలు భరించలేని పరిస్ధితి ఏర్పడింది. పరిస్థితులు మారుతున్నాయనడానికి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే అందుకు ఉదాహరణన్నారు.

రాబోయే ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడతారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. జరగబోయే ఎన్నికల్లో జగన్‌పై వ్యతిరేకతతో పాటు.. ప్రజలు తిరుగుబాటుతో ఓటు వేస్తారన్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలోని 5 కోట్ల ఆంధ్రుల్లో ఉందని ఇప్పుడు సొంత పార్టీలో కూడా మొదలైందన్నారు. సలహదారుల పెత్తనాలు ఎక్కువైయ్యాయన్నారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదన్నారు. జగన్‌కు ముఖ్యమంత్రి హౌదా ఇదే మొదటిది.. చివరిది అన్నారు. ఇక మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో వైసీపీ నాయకుల అరాచకాలు నానాటికీ పెరుగిపోతున్నాయన్నారు. గంజాయి, దొంగనోట్లు, తెలంగాణ మద్యం ఇలా ఒకటేమిటి… డబ్బు సంపాదనే ధేయ్యంగా నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు. నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఆంధ్రప్రభతో మాట్లాడారు.

ప్రభన్యూస్‌: సార్‌ ఎలా ఉన్నారు…

- Advertisement -

యరపతినేని: ఓకే.. ఐయామ్‌ ఫైన్‌

ప్రభన్యూస్‌: వైసీపీ పాలనలో మీ నియోజకవర్గాల్లో అభివృద్ది ఎలా ఉంది?

యరపతినేని: దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుంది. నిరుద్యోగులు గోసపెడుతున్నారు. ఒక్క డీఎస్‌సీ లేదు.. ఒక్క నోటిఫికేషన్‌ లేదు.. ఒక్క పరిశ్రమ లేదు. తెలుగుదేశం హయంలో వచ్చిన పరిశ్రమలన్ని మూసివేశారు. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు పోయాయి. కొత్తవి రావడం లేదు. అమర్‌రాజా ఫ్యాక్జరీ 10 వేల కోట్లు . . 50 వేల మందికి ఉపాధి పరోక్షంగా మరో 50 వేల మంది ఆధారపడ్డారు. అటువంటి దానిని లేనిపోని కారణాలతో పక్క రాష్ట్రానికి పోయేలా చేశారు. పోలీసులు ఆస్తులు , రెవెన్యూ ఆస్తులు , పంచాయతీరాజ్‌ ఆస్తులు తనఖా పెట్టే పరిస్ధితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. పార్టీలను చూసి మనుష్యుల్ని చూసి దాడులు చేయటం పెరిగిపోయింది. వ్యాపారాలపై దాడులు చేయటం మామూలు అయిపోయింది. 20 రోజుల క్రితం వైజాగ్‌లో బిజినెస్‌ సమ్మిట్‌ పెట్టారు. ఏం సాధించారో… పెట్టిన వాళ్లకే తెలియాలి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితే లేదంటే.. రాష్ట్రాన్ని పదిలక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకుపోయారు. అభివృద్ది ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రభన్యూస్‌: అధికారుల పనితీరుపై… ఏమంటారు?

యరపతినేని: అధికారులను చూస్తే బరితెగించిపోయారు. ఈ రెండు నియోజకవర్గాల్లో హత్యలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. అక్రమ మైనింగ్‌ లో పిల్లలు చనిపోయారు. 8 మంది పిల్లలు చనిపోతే కలెక్టర్‌కు, ఎస్పీకి బాధ్యత లేదా ? ఎవరన్నా పోనీ…వాళ్లకు కావాల్సింది డబ్బులు మాత్రమే. చనిపోయిన పిల్లల తల్లిదండ్రుల ఆవేదన అక్రందన ఎవరు పట్టించుకోవాలి. వాళ్ల ఊసురు వీళ్లకు తప్పకుండా తగిలింది. పోలీస్‌గాని , రెవెన్యూ , మైనింగ్‌, ఐఎఏస్‌ , ఐపిఏస్‌ లు సహ అధికార పార్టీకి దాసోహం అంటూ కుక్కిన పేనులా పడిఉంటున్నారు. నేను అనేక సంద్భర్భాల్లో ప్రశ్నించాను ఒక్కరి నుంచి స్పందన రాలేదు. కనీసం చనిపోయిన కుటుంబాల వారిని కూడా పరామర్శించలేదు. వరుసగా మూడేళ్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే రైతులను పరామర్శించే దిక్కులేదు. ధైర్యం చెప్పే దమ్ములేదు. చివరికి మేము వెళ్లి అండగా నిలబడ్డాం.

ప్రభన్యూస్‌: గురజాల నియోజవర్గం ఎలా ఉంది?

యరపతినేని: గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోనూ అరాచక పాలన సాగుతోంది . విష సంసృతి ప్రవేశపెట్టారు.2019 తరువాత ఈ నాలుగేళ్లలో గురజాల నియోజకవర్గంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు చెందిన 11 మందిని , మాచర్ల లో 7 గురిని చంపే శారు…. ఎమ్మెల్యే చేస్తున్న అక్రమ మైనింగ్‌లో 8 మంది పిల్లలు చనిపోయారు. 40 నుంచి యాభై మందిని కాళ్లు చేతులు విరగొట్టారు…. 8 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి…

ప్రభన్యూస్‌: కొంచెం వివరించండి…

యరపతినేని: ఈ నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్‌, పేకాట క్లబ్బులు, గంజాయి, ఇసుక, మద్యం, దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వీటిపై మీడియా ఎంత మొత్తుకుంటున్నా… అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదు. తెలుగుదేశం హయాంలో అద్భుతంగా తీర్చిదిద్దిన దైద టెంపుల్‌ పరిసరాలే ఇప్పుడు గంజాయికి అడ్డాగా మారాయి. కేవలం సాగు మాత్రమే కాదు.. గంజాయిని ఉడకబెట్టి.. ఎండబెట్టి పొడి చేసి… దాన్ని ఎక్స్‌ పోర్టు చేస్తున్నారు… గంజాయి రవాణా అంటే.. ఎక్కడో విశాఖ నుంచో… రంపచోడవరం నుంచో అనేది అందరికీ తెలుసు..కానీ ఇప్పుడు పల్నాడులోనే సాగు చేయిస్తున్నారు. దైదలో నాలుగెకరాల్లో గంజాయి సాగుజరుగుతోంది. చదువుకునే చిన్న పిల్లలకు అలవాటు చేస్తున్నారు… వారిని బానిసలుగా చేస్తున్నారు. రక్తాన్ని పీల్చి డబ్బు సంపాదించుకునే ఇదో విష సంస్కృతి.. ఇక్కడ విస్తరింపచేస్తున్నారు. రేగులగడ్డలో అటవీ ప్రాంతంలో రిజర్వు ఫారెస్టు నుంచి… అక్రమ మైనింగ్‌ చేసి… వేస్టు మెటీరియల్తో ఆ నదిని పూడ్చుకుంటూ వస్తున్నారు… మైనింగ్‌కు పర్మిషన్లు లేవు.

అటవీశాఖ అనుమతుల్లేవు. అక్రమ మైనింగ్‌ జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.ఈ అక్రమ మైనింగ్‌లో 8 మంది పిల్లలు చనిపోయారు.అయినా… కలెక్టరు, ఎస్పీ స్పందించరు. కనీసం ఎమ్మెల్యే నోరు మెదపడు.. తెలంగాణా మద్యం ఏరువై పారుతోంది. రెండురోజుల క్రితం కూడా గురజాలలో నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మోర్జంపాడు లక్ష్మీనరసింహస్వామి తిరునాళ్లలో గుడివాడ గడ్డం బ్యాచ్‌లా ఓ బ్యాచ్‌ దిగింది. అమ్మాయిలకు ఆఫ్‌ నిక్కర్లు వేసి డాన్సులు చేయించాయి. పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశారు. గోవా సంస్కృతిని పల్నాడుకు తీసుకువచ్చి కొత్త విష సంస్కృతికి తెరలేపారు. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అనుచరులు . 2 వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు. అక్రమంగా పట్టాలు సృష్టించుకొని వందల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు.

ప్రభన్యూస్‌: వైసీపీ సంక్షేమ పథకాల సంగతేంటి?

యరపతినేని: ఆటో డ్రైవర్లకు 10 వేలు ఇస్తున్నారు… మరి పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ ధరల సంగతేంటి? చాలాన్ల పేరుతో దోపిడీ జరుగుతోంది. మహిళల పేరుతో కొంత ఇస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్‌ 11వందలు దాటిపోయింది. నిత్యావసరాలు అందటం లేదు. అలా ఇచ్చి ఇలా లాక్కుంటున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు.

ప్రభన్యూస్‌: వైసీపీ నాయకులు 175/175 అంటున్నారు?

యరపతినేని: అనుకోడానికేముంది… గతేడాది వరకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు .. జనంలోనూ, పార్టీలోనూ తిరుగుబాటు మొదలైంది. రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్‌ పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజా సమస్యలపై మా అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తే… తప్పా? అదీ కుప్పంలో.. అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. జీవో నెం1 తీసుకొచ్చారు. ఇది ప్రజాస్వామ్యమా.. అరాచకమా.. ఇప్పుడు మేమే అంటాం.. వైనాట్‌ 175, వైనాట్‌ పులివెందుల.

ప్రభన్యూస్‌: జగన్‌ పాలన ఎలా ఉంది?

యరపతినేని: సీపీఏస్‌ అంటే తెలియని ముఖ్యమంత్రి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అథోగతి పాలవుతోంది. పాలనకు చరమగీతం తప్పదు. ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన కనీస అర్హతలు జగన్మోహన్‌రెడ్డికి లేవు. కుటుంబంలో తల్లిని పక్కన బెట్టి, చెల్లిని బజారులో నిలబెట్టిన వ్యక్తి… అతనికి అధికారం కావాలి…ఇలాంటి వ్యక్తుల ధనదాహనికి , అధికార దాహానికి రాష్ట్రం బలైపోతుంది. ముఖ్యమంత్రిగా ఆయనకు ఇదే మొదలు.. చివరకూడా. ఇందులో భాగంగానే పల్నాడులో అంతులేని అవినీతి జరుగుతోంది. ఫ్యాక్షనిజం విజృంభిస్తోంది. ఎక్కడైతే నిర్బంధం ఉంటుందో అక్కడే తిరుగుబాటు ఉంటుంది. చరిత్ర అదే చెబుతోంది.

ప్రభన్యూస్‌: రానున్న ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి?

యరపతినేని: రాష్ట్రంలో , నియోజకవర్గాల్లో ఏం జరుగు తుందో ప్రజలు గమనిస్తున్నారు. అందులో భాగమే ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్‌ ఎన్నికలు, మరో ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. రెడీ టు ఫైట్‌…

ప్రభన్యూస్‌: టీడీపీ ఎలా ఉండబోతోంది?

యరపతినేని: ఇది 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ. అన్న తారకరామారావు అందించిన స్ఫూర్తి, ప్రేరణతో చంద్రబాబు అందించే ధైర్యంతో ముందుకు సాగుతాం. ఇటువంటి సమయంలో ప్రజలకు అండగా ఉంటాం..

Advertisement

తాజా వార్తలు

Advertisement