Tuesday, October 26, 2021

లఖింపుర్ ఘటన: పోలీసు విచారణకు హాజరైన ఆశిష్ మిశ్రా

ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రా..పోలీసుల ముందు శనివారం హాజరయ్యారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిర‌స‌నకారుల‌పై కారుతో ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు మ‌ర‌ణించారు. ఈ ఘటనలో ఆశిష్ మిశ్రాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గ‌త కొన్ని రోజుల నుంచి ఆచూకీలేని ఆశిష్ మిశ్రా శనివారం ల‌ఖింపూర్‌లో క్రైం బ్రాంచీ ఆఫీసుకు వెళ్లారు. విచారణకు ఆశిష్‌ మిశ్రా పూర్తిగా సహకరిస్తారని అతని న్యాయసలహాదారు తెలిపారు. ఆశిష్‌ మిశ్రాను పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో క్రైమ్‌ బ్రాంచ్‌ పరిసర ప్రాంతాలు, లఖింపుర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

కాగా, యూపీలోని లఖింపుర్‌లో అక్టోబర్ 3న ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన అన్నదాతల దాడిలో మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో ఆశిష్‌ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆశిష్‌పై హత్య కేసు ఉన్నా.. అత‌న్ని ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్టు చేయ‌లేదు. రైతుల మీద‌కు దూసుకెళ్లిన కారు త‌మ‌దే అని చెప్పిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా… ఆ కారులో త‌న‌ కుమారుడు లేర‌ని స్ప‌ష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఆగని పెట్రో మోత.. నేటి రేట్లు ఇవీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News