Friday, April 19, 2024

వాహనదారులకు బీమా భారం…

న్యూఢిల్లి : కార్లు, ద్విచక్రవాహనదారులకు ఇకపై బీమా ఖర్చులు మరింత పెరగనున్నాయి. వాహనాల థర్డ్‌ పార్టీ మోటార్స్‌ ఇన్స్యూరెన్స్‌ ను పెంచుతూ రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నది. జూన్‌ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు తెలిపింది.ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండేళ్ల తరువాత థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంను ప్రభుత్వం పెంచింది. 1000 సీసీ ఇంజన్‌ సామర్థ్యం ఉన్న ప్రైవేట్‌ కార్ల ప్రీమియం రూ.2072 నుంచి 2094కు, 1000 సీసీ నుంచి 1500 సీసీ సామర్థ్యం ఉన్న కార్ల ప్రీమియం రూ. 3,221 నుంచి 3,416కు పెంచింది. అదేవిధంగా 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్‌ సామర్థ్యం ఉన్న కార్ల ప్రీమియంను రూ.7,897 నుంచి 7,890కి తగ్గించింది. 150 సీసీ నుంచి 350 సీసీ సామర్థ్యం ఉండే బైక్‌ల ప్రీమియం జూన్‌ ఒకటి నుంచి రూ. 1366 ఉండనుంది. 340 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌ల ప్రీమియం రూ. 2,804గా నిర్ణయించింది.

30 కిలోవాట్ల కంటే తక్కువ ఉండే ఎలక్ట్రిక్‌ కార్ల ప్రీమియం రూ. 1780, 30 నుంచి 65 కిలోవాట్ల మధ్య ఉండే విద్యుత్‌ కార్ల ప్రీమియం రూ. 2,904గా నిర్ణయించినట్లు నోటిఫికేషన్‌ తెలియజేసింది. ఇక 12000 నుంచి 20 వేల కిలోల సామర్థ్యంగల కమర్షియల్‌ వాహనాల థర్డ్‌ పార్టీ ప్రీమియంను రూ. 33,414 నుంచి 35,313కు పెంచింది. అదేవిధంగా 40 వేల కేజీల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న కమర్షియల్‌ వాహనాల ప్రీమియం రూ. 41,516 నుంచి 44,242కు పెంచింది. పోతే, విద్యా సంస్థలు ఉపయోగించే బస్సులకు ప్రీమియంపై 15 శాతం, హైబ్రీడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలపై 7.5 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రభుత్వం తెలియజేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement