Thursday, April 18, 2024

బల్క్ డ్రగ్ పార్క్ అంశంలో తెలంగాణకు అన్యాయం.. కేంద్రం తీరుపై ఎంపీ నామా నాగేశ్వరరావు ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు కేటాయింపుల విషయంలో కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా అబద్ధాలు చెప్పారని బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలోని బీఆర్‌ఎస్ ఆఫీసు వద్ద మీడియాతో మాట్లాడారు. తాను లోక్‌సభలో మాట్లాడుతున్న సమయంలో తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించామని, వెయ్యి కోట్లు మంజూరు చేశామని, రూ. 300 కోట్లు విడుదల కూడా చేశామని కేంద్రమంత్రి చెప్పారని నామా వెల్లడించారు. అయితే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు విషయంలో రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మాత్రం తెలంగాణకు కేటాయింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా కూడా తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించలేదని వాపోయారు. లోక్‌సభలో బల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చామని మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంట్ సాక్షిగా చెప్పినందుకు తెలంగాణకు ఆ ప్రాజెక్టును తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీద ఉందని నామా నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

- Advertisement -

సభలోనేమో ఇచ్చామని చెబుతూ, రాతపూర్వకంగా లేదంటూ కేంద్ర ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు, వసతులు పుష్కలంగా ఉన్నా కేటాయింపు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ అంశంపై పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారని నామా గుర్తు చేశారు. కరోనా వంటి విపత్కర సమయంలో హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున వ్యాక్సిన్లు సరఫరా చేసిన చరిత్ర తెలంగాణకు ఉందని అన్నారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి బల్క్ డ్రగ్స్‌ను పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్న తరుణంలో బల్క్ డ్రగ్ ప్రోత్సాహక పథకం కింద హైదారాబాద్‌లో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు అవసరమని నొక్కి చెప్పారు. ఇంతవరకు ఏయే రాష్ట్రాలకు అనుమతి ఇచ్చి, నిధులు విడుదల చేశారో స్పష్టంచేయాలని నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement