Friday, April 19, 2024

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం.. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఆన్‌లైన్ తరగతులు..

గడ్కరీతో భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌ను కలిసిన సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా ఒక ఓటీటీ (ఓవర్ ది టాప్) ప్లాట్‌ఫాం ఏర్పాటు గురించి చర్చించారు. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెలకొల్పేందుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ సహా ఆన్‌లైన్ వేదిక ద్వారా ప్రసారాలు, కార్యక్రమాలను అందించే విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఓటీటీ ఎలా ఉండాలన్న అంశంపై చర్చించినట్టు తెలిసింది. విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనతో పాటు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా ఓటీటీ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం కార్పొరేట్ స్థాయిలో ఆన్‌లైన్ విధానాల్లో వివిధ తరగతులకు సంబంధించిన బోధనా వీడియోలు, సమాచారం అందుబాటులో ఉంది. అయితే ఇవి కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నిరుపేదలకు సైతం ఉచితంగా ఆన్‌లైన్ ద్వారా స్టడీ మెటీరియల్, తరగతులకు సంబంధించిన వీడియోలు అందుబాటులోకి తేవడం కోసం ఓటీటీ ప్లాట్‌ఫాం సిద్ధం చేస్తున్నట్టు సీఎం జగన్ కేంద్ర మంత్రికి వివరించారు. ప్రతి విద్యార్థికి ఒక ట్యాబ్ అందజేసి, ఓటీటీ ద్వారా క్లాసులు లైవ్ స్ట్రీమింగ్, ఆ తర్వాత రికార్డు చేసిన వీడియోలను అందులో ఉంచనున్నారు. తద్వారా ఆ సమయానికి విద్యార్థి లైవ్ స్ట్రీమింగ్ చూడలేకపోయినా, డౌన్లోడ్ చేసుకుని తర్వాతైనా సరే తనకు కావాల్సిన పాఠాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఓటీటీ ద్వారా ప్రసారం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. తద్వారా తాము చెప్పదల్చుకున్నది నేరుగా ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫాంను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉన్నా సరే ఆ ప్రభుత్వం కొనసాగించేలా రూపొందించనున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం, అవాస్తవ కథనాలు, వక్రీకరణలను తిప్పికొట్టేందుకు కూడా ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. ఓటీటీ ప్లాట్‌ఫాంతో పాటు రాష్ట్రంలో క్రీడా మైదానాల అభివృద్ధి గురించి, క్రీడాసంబంధిత ఇతర అంశాల గురించి మాట్లాడినట్టు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement