Thursday, April 25, 2024

500 విమానాలకు ఇండిగో ఆర్డర్‌..

దేశంలో ప్రస్తుతం అగ్రగామి ఏయిర్‌లైనర్‌ సంస్థగా ఉన్న ఇండిగో 500 కొత్త విమానాలకు ఆర్డర్‌ ఇవ్వనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎయిర్‌బస్‌ నుంచి ఏ320 నారో బాడీ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ఈ వర్గాలు తెలిపాయి. ఎయిర్‌ ఇండియాతో పోటీలో పై చేయి సాధించేందుకు ఇండిగో దూకుడు పెంచింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిర్‌ ఇండియా 470 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చింది. తాజాగా ఇండిగో 500 విమానాలను ఆర్డర్‌ ఇవ్వడంతో ఎయిర్‌ ఇండియాని అధిగమించాలని భావిస్తోంది.

ఎయిర్‌బస్‌ రేట్ట ప్రకారం చూస్తే ఈ డీల్‌ విలువ 50 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. సాధారణంగా బల్క్‌ డీల్స్‌లో ఈ రేట్లు భాగా తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎయిర్‌ బస్‌తో పాటు బోయింగ్‌ కంపెనీ కూడా ఇండిగోకు ఏ330 నియో విమానాలు కాని, 787 వైడ్‌ బాడీ బోయింగ్‌ విమానాలను విక్రయించేందుకు చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇస్తాంబుల్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ వార్షిక సమావేశానికి హాజరైన ఇండిగో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ఎల్బర్స్‌ ఈ డీల్‌పై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.

- Advertisement -

మన దేశ విమానయాన మార్కెట్‌లో ఇండిగో సంస్థకు 56 శాతం వాటా కలిగి ఉంది. కొత్త విమానాల కొనుగోలపై ఇండిగో విమానాల తయారీ కంపెనీలైన ఎయిర్‌బస్‌, బోయింగ్‌తో చర్చలు జరుపుతున్నది. ఈ డీల్‌ ఫైనల్‌ అయితే ఒకే సంస్థ ఇంత భారీగా ఒకేసారి 500 విమానాలకు ఆర్డర్‌ ఇవ్వడం ఇదే తొలిసారి అవుతుంది. ఇస్తాంబుల్‌లో జరిగిన ఎయిర్‌లైన్స్‌ ఇండస్ట్రీ మీట్‌లో ఈ రంగంలో ఉన్న అవకాశాల గురించి, కొవిడ్‌ కంటే ముందు స్థాయికి ప్రయాణికుల సంఖ్య చేరుకోవడంపై చర్చలు జరిగాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కోవిడ్‌ కంటే ముందు నాటి స్థితికి ప్రయాణికుల సంఖ్య చేరుకుంది. ఎయిర్‌ బస్‌, బోయింగ్‌ కంపెనీల చేతిలో 2030 నాటి వరకు సరఫరా చేసే విమానాల ఆర్డర్లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement