Friday, April 19, 2024

ఇండోనేషియా చేరుకున్న భార‌త ప్రధాని.. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో బాలిలో ఘనస్వాగతం

జీ20 దేశాల సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వాల (సోమ‌వారం) ఇండోనేషియా వెళ్లారు. ప్ర‌త్యేక విమానంలో వెళ్లిన ఆయ‌న‌కు బాలిలో ఘనస్వాగతం లభించింది. ఎయిరిండియా వన్ విమానంలో బాలి చేరుకున్న ప్ర‌ధానికి ఇండోనేషియా ప్రభుత్వ వర్గాలు సంప్రదాయకంగా స్వాగతం పలికాయి. భార‌త ప్ర‌ధాని గౌరవార్థం ఎయిర్ పోర్టులోనే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ప్ర‌ధానికి స్వాగతం పలికేందుకు ఇండోనేషియా ప్రభుత్వ పెద్దలతో పాటు సైనిక ఉన్నతాధికారులు విచ్చేశారు. అటు బాలిలో భారతీయులు కూడా స్వాగతం పలికారు.

ఇండోనేషియాలో ఈ నెల 15, 16 తేదీల్లో జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ దేశాధినేతలతో ఈ సందర్భంగా భార‌త ప్ర‌ధాని సమావేశం కానున్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్, జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ హాజరవుతున్నారు. అయితే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీ20 సదస్సుకు హాజరుకావడంలేదు.

ఇండోనేషియాలో పర్యటన సందర్భంగా భార‌త ప్రధాని దాదాపు 20 సమావేశాల్లో పాల్గొననున్నారు. అంతేకాదు, జీ20 గ్రూప్ అధ్యక్ష బాధ్యతలు కూడా ఈ సదస్సు ద్వారా భారత్ కు బదిలీ కానున్నాయి. ఏడాది పాటు భారత్ జీ20 కూటమికి అధ్యక్షత వహించనుంది. ఈ ఏడాది జీ20కి ఇండోనేషియా అధ్యక్షత వహించగా, డిసెంబరు 1 నుంచి భారత్ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement