Wednesday, April 24, 2024

టెక్ కంపెనీల్లో భారతీయుల హవా.. యూట్యూబ్‌ సీఈవోగా నీల్‌ మోహన్‌

(న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) : సుందర్‌ పిచ్చెయ్‌.. పరాగ్‌ అగర్వాల్‌.. సత్య నాదెళ్ళ.. శాంతను నారాయణ్‌.. అరవింద్‌ కృష్ణన్‌.. రాజ్‌సుబ్రహ్మణ్యం.. లీనా నాయర్‌.. సీఎస్‌ వెంకటకృష్ణన్‌.. తాజాగా ఇప్పుడీ జాబితాలో నీల్‌మోహన్‌.. భారతీయ సంతతికి చెందిన నీల్‌మోహన్‌ ప్రపంచంలోనే అగ్రగామి ఆన్‌లైన్‌ వీడియో ఫ్లాట్‌ఫారం సంస్థ యూట్యూబ్‌ కొత్త సీఈవో (కార్యనిర్వహణాధికారి)గా నియమితులయ్యారు. భారతీయులు, భారత సంతతికి చెందిన ఆధునిక మేథావుల సామర్థ్యాన్ని నీల్‌మోహన్‌ నియామకం మరోసారి ప్రపంచానికి తేటతెల్లం చేసింది. భారతీయులు దేశంలో ఉన్నా విదేశాలకెళ్ళినా ఎప్పుడూ తమ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అందొచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుని అత్యున్నత శిఖరాలకు చేరుకున్న వారిలో భారతీయులే అధికం. ఇప్పుడు బహుళజాతి కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలన్నీ తమ భవిష్యత్‌ భారతీయుల చేతుల్లోనే పెడుతున్నాయి. వీటిపాలనా పగ్గాల్ని వీరికే అప్పగిస్తున్నాయి. వీరి అజమాయిషీలో ఈ సంస్థలు మరింతగా రాణిస్తాయన్న విశ్వాసం వాటిలో స్పష్టమౌతోంది.

ఇప్పటికే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఐబీఎమ్‌, నోకియా, మోటొరాల , మాస్టర్‌కార్డ్‌, అడోబ్‌ వంటి అంతర్జాతీయంగా విస్తరించిన సంస్థల నిర్వహణా బాధ్యతలు భారతీయులే నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు భారతీయ సంతతికి చెందిన 49ఏళ్ళ నీల్‌మోహన్‌ యూట్యూబ్‌ సీఈవోగా ఎంపిక కావడం మరోసారి భారతీయ మేథస్సుకు అద్దంపడుతోంది. ప్రస్తుతం ఆయన యూట్యూబ్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. మోహన్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో 1996లో కంప్యూటర్‌సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2005లో స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 2008లో గూగుల్‌లో చేరారు. ఇంతవరకు అప్పటి నుంచి గూగుల్‌ వీడియో విభాగం చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా 2015నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గూగుల్‌కు చెందిన వీడియో విభాగం యూట్యూబ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది.

యూట్యూబ్‌పై ఆధారపడి మిలియన్‌ల సంఖ్యలో కంటెంట్‌ క్రియేటర్స్‌, బ్లోగర్స్‌ ఉపాధి పొందుతున్నారు. అతితక్కువ సమయంలోనే యూట్యూబ్‌ ఓ గొప్ప సామాజిక మాద్యమ వ్యవస్థగా ఎదిగింది. యూట్యూబ్‌లో చేరినప్పటి నుంచి ఫ్లాట్‌ఫారం వృద్ధి, విస్తరణలో నీల్‌మోహన్‌ కీలకపాత్ర పోషించారు. గూగుల్‌లో చేరినప్పటి నుంచి ప్రకటనలు, ప్రదర్శనల విభాగం సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌గా పొందిన అనుభవం ఆయనకు తోడైంది. యూట్యూబ్‌లో యాడ్‌సెన్స్‌, డబుల్‌క్లిక్‌లను అభివృద్ధి చేయడంలో మోహన్‌ కీలకపాత్ర పోషించారు. మోహన్‌ నాయకత్వంలోనే యూట్యూబ్‌ మ్యూజిక్‌, యూట్యూబ్‌ టీవీ, యూట్యూబ్‌ ప్రీమియం, యూట్యూబ్‌షార్డ్‌లతో సహా అనేక విజయవంతమైన ఉత్పత్తుల్ని, ఫీచర్‌లను గూగుల్‌ విడుదల చేసింది. అలాగే వినియోగదార్ల అభిరుచులకనుగుణంగా కంటెంట్‌ సూచించే అల్గారిదంలను మెరుగుపర్చడంలో కూడా మోహన్‌ కీలకపాత్ర పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement